ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి

ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి

కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, సింగ్‌పూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒమిక్రాన్‌పై కీలక ప్రకటన చేసింది. డెల్టా, బీటా వేరియంట్‌లతో పోల్చితే ఒమిక్రాన్ వల్ల రీ-ఇన్‌ఫెక్షన్ ముప్పు ఎక్కువని, మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచవ్యాప్తంగా ప్రారంభ క్లినికల్ పరిశీలనలు సూచిస్తున్నాయని మంత్రి పేర్కొన్నట్టు స్థానిక మీడియా తెలిపింది.

అంటే, గతంలో కోవిడ్-19 బారినపడ్డవారు సైతం ఒమిక్రాన్ వల్ల మరోసారి ఇన్‌ఫెక్షన్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. సింగ్‌పూర్‌లో ఆదివారం మరొ ఒమిక్రాన్ కేసు నిర్ధారణ అయ్యింది. డిసెంబరు 1న దక్షిణాఫ్రికా నుంచి విమానంలో వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అదే విమానంలో ఈ 37 ఏళ్ల వ్యక్తి కూడా వచ్చినట్టు అధికారులు తెలిపారు. అతడు రెండు డోస్‌ల టీకా తీసుకున్నాడని పేర్కొన్నారు. మరోవైపు, ఆదివారం సింగ్‌పూర్‌లో కొత్తగా 552 కేసులు నిర్ధారణ కాగా.. 13 మంది చనిపోయారు.

ఒమిక్రాన్ విషయంలో గత కొద్ది రోజుల నుంచి దక్షిణాఫ్రికా, ఇతర దేశాల నుంచి, నిపుణుల నుంచి సమాచారాన్ని సేకరించి సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. ‘ఈ ప్రకటన Omicron వేరియంట్‌పై అవగాహనను మరింత పెంచింది.. అయితే చాలా ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు’ అని మంత్రిత్వ శాఖ వ్యాఖ్యలను స్థానిక మీడియా కోట్ చేసింది.

ఈ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచెందుతోందని, మన సరిహద్దుల్లో మరిన్ని కేసులు బయటపడతాయనే అనుమానం వ్యక్తం చేసింది. ‘కొత్త వేరియంట్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు పనిచేస్తాయా? అనే అంశంపై అధ్యయనం కొనసాగుతోంది.. కానీ, పలువురు పరిశోధకులు మాత్రం ఒమిక్రాన్‌పై కూడా పనిచేస్తాయని, ముఖ్యంగా వైరస్ తీవ్రం కాకుండా అడ్డుకుంటాయని అంచనా వేస్తున్నారు’ అని తెలిపింది. కాబట్టి ఇప్పటికీ వ్యాక్సిన్ వేసుకోనివారు టీకా తీసుకోవాలని, బూస్టర్ డోస్‌లకు ముందుకురావాలని అభ్యర్ధించింది.