ఒమిక్రాన్ వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. క్రిస్మస్ పండగ సీజన్లో సైతం యూరప్ దేశాలు కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో డిసెంబరు మలి భాగంలోకి వచ్చినా మార్కెట్లో కరెక్షన్ కొనసాగుతూనే ఉంది. ఫలితంగా స్టాక్మార్కెట్లో బేర్ హవా కొనసాగుతోంది. ఫలితంగా ఈ వారం మార్కెట్ ఆరంభమైన కొద్ది సేపటికే నష్టాలు మొదలయ్యాయి.
ఈ రోజు ఉదయం ఎన్ఎస్సీ నిఫ్టీ నష్టాలతోనే మొదలైంది. గత వారం 16,985 దగ్గర క్లోజవగా సోమవారం ఉదయం 16,824 దగ్గర ఓపెన్ అయ్యింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ఉదయం 9:30 గంటల సమయంలో 310 పాయింట్లు నష్టపోయి 16,674 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ 55,517 పాయింట్ల దగ్గర ప్రారంభం అవగా ఉదయం 9:30 గంటల సమయానికి 1,044 పాయింట్లు నష్టపోయి 55,967 దగ్గర కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు అర గంట వ్యవధిలోనే ఏకంగా 1.80 శాతానికి పైగా క్షీణించాయి. మరోసారి సెన్సెక్స్ 55వేలకు పడిపోయింది. నిఫ్టీ 16,600 పాయింట్ల రేంజ్లో కొట్టుమిట్టాడుతోంది.