కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వాయువేగంతో దూసుకువెళ్తోందని.. మార్చి నాటికి ప్రపంచంలో ఏకంగా సగం మంది దాని బారిన పడతారని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. ఈ నెల 17వ తేదీ నాటికే ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్ల మంది ఒమిక్రాన్ బారినపడి ఉంటారని అంచనా వేసింది. గతేడాది ఏప్రిల్‌లో డెల్టా వేరియంట్ తీవ్రస్థాయిలో ఉన్నప్పటితో పోలిస్తే ఇది పదిరెట్లు ఎక్కువని పేర్కొంది.
డెల్టాతో పోలిస్తే.. ఒమిక్రాన్ కారణంగా ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య 50 శాతం తగ్గిందని, వెంటిలేటర్ అవసరం పడేవారి సంఖ్య 90 శాతం తగ్గిందని వివరించింది. అయితే.. కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆ మేరకు ఆస్పత్రుల్లో చేరికలు కూడా ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. గతంలో కరోనా బారినపడిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరిని గుర్తించారని.. ప్రస్తుతం ఒమిక్రాన్‌లో లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం వల్ల అది సోకిన ప్రతి 20 మందిలో సగటున ఒకరినే గుర్తించగలుగుతున్నామని పేర్కొంది.