కేసీఆర్ కే అఖిలేష్ జై, మమతా బెనర్జీ ట్విస్ట్ : చంద్రబాబుకు కేసీఆర్ షాక్…!

On Meet With KCR Akhilesh Yadav Takes Rain Check Mayawati Silent

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు ముందు చుక్కెదురు అయినా ఇప్పుడు అనూహ్య మద్దతు లభిస్తోందని తెలుస్తోంది. ఇటీవల ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కలిశారు. కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెస్సేతర ఫ్రంట్‌ల కోసం ప్రయత్నాలు చేస్తుంటే, చంద్రబాబు బీజేపీయేతర ఫ్రంట్ కోసం చూస్తున్నారు. ఇప్పటి వరకు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతిలు బీజేపీయేతర ఫ్రంట్ అయిన కాంగ్రెస్ వైపు ఉంటున్నట్లుగానే కనిపిస్తోంది. కానీ కేసీఆర్ ప్రయత్నాల అనంతరం తారుమారు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలపై ప్రశంశలు కురిపించారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే వారు కాంగ్రెస్ కూటమిలో ఉండే అవకాశాల పై అనుమానాలకు రేకెత్తిస్తోంది. అదే జరిగితే చంద్రబాబు బీజేపీయేతర కూటమి, కాంగ్రెస్ అనుకూల కూటమికి షాక్ అని చెప్పవచ్చు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై స్పందించిన అఖిలేష్ యాదవ్ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా కేసీఆర్‌ చేస్తోన్న ప్రయత్నాలు అభినందనీయమని దేశంలోని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొన్ని నెలలుగా జరుగుతున్నాయని, ఆ దిశగా కేసీఆర్‌ పని చేస్తున్నారని అన్నారు. వచ్చే ఏడాది హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలుస్తానని, తమ తమ రాష్ట్రాల్లో ఎన్నో మంచి పనులు చేసిన మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒకే వేదిక పైకి వచ్చేందుకు కలిసి రావాలన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమయ్యాయని, ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారన్నారు.

అంతేకాక మరోపక్క మమతా బెనర్జీ తీరు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీతోను విభేదిస్తున్నారా అనే చర్చ సాగుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం ప్రభుత్వాధికారులతో మమతా సమావేశమయయి కొందరు రైతు రుణాల మాఫీని ప్రకటిస్తున్నారని, నిజానికి ఇందువల్ల క్షేత్రస్థాయిలో రైతులకు లబ్ధి చేకూరుతోందా లేదా అనే దానిపై తాను ప్రస్తుతం సమాచారం సేకరిస్తున్నానన్నారు. అయితే, రైతు రుణాల మాఫీని ప్రశ్నించిన మమత నేరుగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన మాత్రం తీసుకు రాలేదు. బీజేపీ రైతు భీమా పథకం పైనా మమత సెటైర్లు వేశారు. రైతు రుణాలపై మమత వ్యాఖ్యలను చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఆమె దూరంగా ఉండనున్నారా అనే చర్చ సాగుతోంది. ఇందుకు ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు కూడా తోడవుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇటీవల అధికారంలోకి రాగానే రైతు రుణాల మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 11న మూడు రాష్ట్రాల ఫలితాలు వెలువడగానే మమతా బెనర్జీ ట్విట్టర్‌లో ఆయా రాష్ట్రాల ప్రజలకు అభినందనలు తెలిపారే కానీ, ప్రత్యేకించి కాంగ్రెస్‌‌కు అభినందనలు తెలపలేదు. ఇదే సమయంలో తెలంగాణలో విజయం సాధించగానే కేసీఆర్‌కు అభినందలు తెలిపారు. దీంతో కేసీఆర్ చెబుతున్న కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ వైపు మమత, అఖిలేష్ లు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది.