దేశంలో చోటు చేసుకుంటున్న వరుస పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. మనసిచ్చి మనువాడటమే వారి పాలిట శాపంగా మారుతోంది. ఇటీవల హైదరాబాద్ సమీపంలో జరిగిన హేమంత్ హత్యోదంతం మరవక ముందే కర్ణాటలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి భార్య తండ్రి చేతిలో ఓ యువకుడి(24) ప్రాణం బలైపోయింది. వివరాలు.. రాష్ట్రానికి చెందిన ఓ యువతి, లక్ష్మీపతి అనే యువకుడు 2017లో ఒకే ఫ్యాక్టరీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరిది వేరు వేరు కులాలు అవ్వడంతో తల్లిదండ్రులు పెళ్లికి అడ్డు చెప్పారు. తల్లిదండ్రులను ఒప్పించలేక పారిపోయి గత నెలలో వివాహం చేసుకున్నారు.
ఇలా వీరి జీవనం కొనసాగుతుండగా.. తన కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని యువతి కుటుంబ సభ్యులు జీర్ణించులేకపోయారు. ప్రేమ వివాహం కారణంగా ఇరు కుటుంబాలతో ఏర్పడిన గొడవలను సర్దుమణిగించేందుకు చర్చించుకుందామని యువతి తండ్రి తన కూతురిని ఒప్పించాడు. ఇద్దరు తిరిగి ఇంటికి రావాలని, వారికి మళ్లీ పెళ్లి చేస్తానని చెప్పి ఆమెను నమ్మించాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం యువతి కుటుంబం లక్ష్మీపతితో పాటు తన అన్నయ్య నటరాజ్‌ను మగడి తాలూకా సమీపంలోని ప్రార్థన మందిరానికి తీసుకెళ్లారు. అక్కడ వారితో కొద్దిసేపు చర్చించిన అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వారికి మద్యం తాగించారు. అంతటితో ఆగకుండా కులం పేరుతో దుషిస్తూ, తన కూతురిని పెళ్లి చేసుకోవాలని కలలో కూడా కోరుకోవద్దని లక్ష్మీపతిని బెదిరించారు.
దీనికి అతను ఒప్పుకోకపోవడంతో లక్ష్మీపతిపై యువతి కుటుంబం దాడికి దిగింది. ఇంతలోనే కోపం పట్టలేని యువతి తండ్రి తన కొడుకు సాయంతో లక్ష్మీపతిని తన అన్న కళ్లేదుటే భయంకరంగా బెల్టుతో గొంతు నులిపి చంపాడు. భయాందోళనకు గురైన నటరాజ్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకొని తన తమ్ముడి హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం బయటకు చెప్తే ఇతర కుటుంబ సభ్యులను చంపేస్తామని యువతి కుటుంబం బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి తండ్రిని, సోదరుడిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.