హ్యాండ్‌ బ్యాగ్‌లో పేలిన వన్‌ప్లస్‌ ఫోన్‌

హ్యాండ్‌ బ్యాగ్‌లో పేలిన వన్‌ప్లస్‌ ఫోన్‌

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ భారత మార్కెట్‌లోకి వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీఫోన్‌ను రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ మహిళ హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉండగా ఒక్కసారిగా పేలిపోయింది. వివరాల్లోకి వెళ్తే..బెంగళూరుకు చెందిన అంకూర్‌ శర్మ భార్య ఐదు రోజుల క్రితమే వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీ ఫోన్‌ను కొనుగోలు చేసింది. రోజువారి దినచర్యలో భాగంగా అంకూర్‌ భార్య ఆదివారం రోజున ఉదయం సైక్లింగ్‌ చేస్తూ వన్‌ ప్లస్‌ నార్డ్‌ 2 ఫోన్‌ను హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లింది.

కొద్ది దూరం వెళ్లగానే ఒక్కసారిగా వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ పేలింది. దీంతో ఉలిక్కిపడ్డ అంకూర్‌ భార్యకు యాక్సిడెంట్‌ జరిగింది. తరువాత తేరుకున్న అంకూర్‌ భార్య తన బ్యాగు నుంచి పొగలు రావడంతో షాక్‌కు గురైంది. ఈ విషయాన్ని అంకూర్‌ ట్విటర్‌ ద్వారా వన్‌ప్లస్‌ కస్టమర్‌ సపోర్ట్‌కు రిపోర్ట్‌ చేశాడు. పేలుడుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ సంఘటనపై వన్‌ప్లస్‌ స్పందించింది. అంకూర్‌ చేసిన ట్విట్‌కు వన్‌ప్లస్‌ కస్టమర్‌ సపోర్ట్‌ రిప్లై ఇచ్చింది.

ఫోన్‌ పేలిపోయినందుకు చింతిస్తున్నామని వన్‌ప్లస్‌ కస్టమర్‌ సపోర్ట్‌ పేర్కొంది. పేలుడుకు సంబంధించిన విషయాన్ని నేరుకు కంపెనీకి మెసేజ్‌ చేయాల్సిందిగా సూచించారు. ఫోన్‌లో ఏర్పడిన లోపంను విశ్లేషించి, తిరిగి కొత్త ఫోన్‌ను అందిస్తామని తెలియజేశారు. కాగా ఫోన్‌ పేలుడుకు సంబంధించి బాధితుడికి ఏమైనా పరిహారం ఇచ్చారా లేదా..! అనే విషయం తెలియాల్సి ఉంది. వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ పేలడం ఇదే మొదటిసారి కాదు. 2019లో కూడా ఒకసారి వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ పేలింది. అప్పుడు కూడా వన్‌ప్లస్‌ ఇదే రకంగా స్పందించింది.