వన్ ప్లస్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో తన మొట్టమొదటి స్మార్ట్ వాచ్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వన్‌ప్లస్ వాచ్ కోబాల్ట్ లిమిటెడ్ ఎడిషన్ అనే కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది. మనదేశంలో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. ఇందులో 1.39 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని ధరను మనదేశంలో రూ.19,999గా నిర్ణయించారు. జులై 16వ తేదీన దీని సేల్ జరగనుంది. వన్‌ప్లస్.ఇన్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు. జులై 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దీని ప్రీ-ఆర్డర్లు జరగనున్నాయి.
ఈ వాచ్ ప్రీ-బుక్ చేసుకున్న వారికి వాచ్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అయితే దీనికి సంబంధించిన నగదు చెల్లింపును జులై 12వ తేదీ నుంచి 15వ తేదీ లోపు పూర్తి చేయవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులు లేదా ఈఎంఐ ద్వారా ఈ వాచ్ కొనుగోలు చేస్తే.. రూ.1,000 తగ్గింపు లభించనుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. దీంతోపాటు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం తగ్గింపు లభించనుంది.
ఇందులో 1.39 అంగుళాల హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 454×454 పిక్సెల్స్‌గా ఉంది. ఈ స్మార్ట్ వాచ్‌లో సాఫైర్ గ్లాస్‌ను అందించారు. దీని బ్రైట్ నెస్ ఎక్కువగా ఉండనుంది. దీంతోపాటు స్క్రాచ్ రెసిస్టెన్స్‌ను కూడా ఇందులో అందించారు..
ఇందులో ఎస్‌పీఓ2 మానిటరింగ్, స్ట్రెస్ డిటెక్షన్, బ్రీతింగ్, ర్యాపిడ్ హార్ట్ రేట్ అలర్ట్స్, సెకండరీ రిమైండర్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటిని వన్ ప్లస్ హెల్త్ యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 402 ఎంఏహెచ్‌గా ఉంది. వార్ప్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. కేవలం 20 నిమిషాల చార్జింగ్‌తో వారానికి సరిపడా బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.
ఈ వాచ్ ద్వారా మీరు వన్‌ప్లస్ టీవీని కూడా కంట్రోల్ చేయవచ్చు. టీవీని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, వాల్యూమ్ కంట్రోల్ చేయడం వంటివి ఇందులోనే చేయవచ్చు. ఈ వాచ్‌లోనే 4 జీబీ స్టోరేజ్‌ను కూడా అందించనున్నారు. ఐపీ68 రేటింగ్, 5ఏటీయం డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఇందులో ఉండనున్నాయి.