అతనికే ఇదివరకే పెళ్లి అయ్యింది. అది తెలిసి కూడా ఆమె అతన్నే ప్రేమించింది. రెండో భార్యగా అయినా సరే అతనితో జీవితం పంచుకునేందుకు సిద్ధపడింది. ఇష్టపడ్డ వ్యక్తి సహా సమాజం అందుకు ఒప్పుకోలేదు. మరో వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధపడింది. సరిగ్గా నిశ్చితార్థం ముందు.. ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక, మనసు చంపుకోలేక బలవన్మరణానికి పాల్పడింది.
‘‘నేను నా ఇష్టపూర్వకంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నా… ఐ లవ్ యూ దీపక్. బతికుండగా నీదానిని కాలేకపోయా. ఎందుకంటే.. మీకు ఇప్పటికే పెళ్లయ్యి పోయింది. ఎవరూ అందుకు ఒప్పుకోలేదు. నా తల్లిదండ్రులు చాలా మంచివారు. మా తమ్ముడు ధీరజ్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను మరోలా అర్థం చేసుకోకండి.. ఐ లవ్ యూ దీపక్’’ అంటూ రక్తంతో సూసైడ్ లేఖ రాసి ప్రాణం తీసుకుంది 23 ఏళ్ల శివాని.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని నాగిన్ నగర్‌లో ఉంటోంది శివాని కుటుంబం. స్థానిక ఓ ప్రైవేట్ కాలేజీలో ఆమె పీజీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆ ఏరియాలోనే దీపక్‌కు శానిటరీ షాపు ఉంది. ఆయన వివాహితుడు. అది తెలిసి కూడా శివాని ప్రేమ పేరుతో ఆయన వెంటపడింది. ఈ విషయంపై దీపక్ భార్య, శివాని ఇంటికి వచ్చి గొడవ పడింది కూడా. ఆ సమయంలో.. దీపక్‌కు రెండో భార్యగా ఉంటానంటూ శివాని చెప్పగా, పెద్ద పంచాయితీయే జరిగింది.
ఈ గొడవ తర్వాత కుటుంబ సభ్యులు శివానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆపై శివానికి విజయ్ నగర్ ఏరియాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లి నిర్ణయించారు. మరికొన్ని రోజుల్లో ఎంగేజ్‌మెంట్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం.. ఇంట్లో ఎవరూ లేని టైంలో శివాని బలవన్మరణానికి పాల్పడింది. ముందు బ్లేడ్‌తో చేతులు, కాళ్లు కోసుకున్న శివాని.. ఆ రక్తంతో సూసైడ్ నోట్ రాసింది. ఆపై ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, దీపక్ లేని జీవితం ఊహించుకోలేక చనిపోతున్నట్లు ఆమె అందులో పేర్కొంది. ఈ మేరకు పోలీస్ అధికారి సంజయ్ శుక్లా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.