మార్చిలో మూతపడిన విద్యా సంస్థల గేట్లు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. అయితే చదువుకు ఆంటంకం కలగకుండా ఉండేందుకు అన్ని తరగతుల్లోని విద్యార్థులకు దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు యూట్యూబ్, స్వయం ప్రభ ద్వారా 24×7 విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ స్కూల్స్(డీఐఓఎస్) కార్యాలయం ఓ సర్వే చేపట్టింది. సంగం(అలహాబాద్) నగరంలోని వివిధ ఇంటర్మీడియట్ కళాశాలలో 9 నుంచి 12వ తరగతి వరకు చేరిన దాదాపు 58,000 వేల మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, కంపూట్యర్లు వంటివి అందుబాటులో లేవని ఈ సర్వేలో వెల్లడైంది.
ఈ విద్యార్థులు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్ పాఠశాలల్లో చేరిన మొత్తం సంఖ్యలో 19% మంది ఉన్నారు. ఈ విద్యా సంస్థల్లో చేరిన అధిక మంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులతోపాటు యూట్యూబ్, స్వయం ప్రభ ద్వారా ప్రసారం చేస్తున్న విద్యా కార్యక్రమాలను పొందలేకపోతున్నారని సర్వే ఫలితాల్లో తేలింది. కరోనా మహమ్మారి వచ్చిన గత నాలుగు నెలల నుంచి వివిధ మాధ్యమాల ద్వారా అందింస్తున్న విద్యా విషయాలను అంచనా వేయడానికి జిల్లాలో చేపట్టిన సర్వేలో ఈ ప్రాధమిక వాస్తవాలు వెలువడ్డాయని ప్రయాగ్‌రాజ్ జిల్లా విద్యాధికారి ఆర్‌ఎన్ విశ్వకర్మ తెలిపారు. వివిధ విద్యా సంస్థల్లో చేరిన ప్రతి విద్యార్థికి ఆన్‌లైన్ క్లాసుల ద్వారా పూర్తి ప్రయోజనం పొందేగలిగేలా విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
తమ సర్వేలో ప్రయాగరాజ్‌లోని 1057 పాఠశాలలు ఉన్నాయన్నారు. వీటిలో 33 ప్రభుత్వ, 181 ప్రభుత్వ సహాయం పొందేవి. 843 ప్రైవేటు సెంకడరీ స్కూల్స్ ఉన్నాయని తెలిపారు. ఈ సంస్థలలో ప్రస్తుతం 3,06,470 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. వీరిలో 9వ తరగతిలో 77,163.. 10వ తరగతిలో 1,06,793.. 11వ తరగతిలో 51,324.. 12వ తరగతిలో 71,190 మంది ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో 9వ తరగతిలోని 61,590 మందికి, 10వ తరగతిలో 91,350 మందికి, 11వ తరగతిలో 43,365 మందికి, 12వ తరగతి 51,939 మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, టీవీ, ఇంటర్నెట్ కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయని సర్వేలో తేలిందని పేర్కొన్నారు.