వైద్యో నారాయణ హరి అంటారు..దేవుడు ఇచ్చిన జన్మకు మళ్లీ పునర్జన్మనివ్వగల గొప్ప సౌభాగ్యం వైద్యులకు ఉంటుంది. అందుకే వైద్యులను దేవుడితో పోలుస్తారు. అలాంటి వైద్య వృత్తి ఈ మద్య కొంత మంది మచ్చ తెస్తున్నారు. తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ..రోగులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక ప్రైవేట్ వైద్యం అంటే తలకు మించిన భారం అని తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు. ఇక్కడ కొంత మంది వైద్యులు చేసే ఘనకార్యాలు వర్ణనాతీతంగా ఉంటుంటాయి.
తాజాగా తమిళనాడులో ఘోరం జరిగింది. ఆసుపత్రిలో ఓ మహిళకు కాన్పు చేసిన వైద్యులు ఆమె కడుపులో సూదిని వదిలేసిన ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఉచ్చిపల్లిలో చోటు చేసుకుంది. రమ్య అనే ఓ నిండు గర్భిణి ఈ నెల 19న ఉచ్చిపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కాన్పు తర్వాత రమ్యకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. కడుపు నొప్పి, రక్త స్రావంతో విల విలలాడింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు మళ్లీ ఆసుపత్రికి తీసుక వెళ్లారు.
అక్కడ ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యులు షాక్ తిన్నారు. ఆమె కడుపులో సూది ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు ఆసుపత్రిలో కాన్పు చేసిన సమయంలో సూదిని లోపలే ఉంచి కుట్లువేసినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం మదురై ఆసుపత్రిలో రమ్య ఆపరేషన్ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఒక నిండు గర్భిణి విషయంలో వైద్యులు ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వ్యవరించారని ఆమె తరుపు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉచ్చిపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ముందు ఆందోళనకు దిగారు.
అయితే రమ్యకు ఆపరేషన్ చేసిన వైద్య సిబ్బందిని ఆమెను ఇబ్బందిపెట్టినందుకు విధుల్లోనుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని వైధ్యాధికారులు వెల్లడించారు.