వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌

వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ చేసింది. నాలుగు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో 30న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తొలుత ఇది 29వ తేదీనే ఏర్పడుతుందని అంచనా. కానీ ప్రస్తుతం బ్యాంకాక్‌ సమీపంలో ఉండడంతో అండమాన్‌ తీరానికి వచ్చేందుకు సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావం ఏపీలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు ఉత్తరాంధ్రలో కొంతమేర ఉండే అవకాశం ఉందని తెలిపారు.తమిళనాడుపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో మదురై, విరుదునగర్‌ జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. తాజాగా మళ్లీ వానలు పడుతుండటంతో వరదముప్పు ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు పలు జిల్లాల్లో చెక్‌డ్యాంల నుంచి వరద ముప్పు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. భారీవర్షాల కారణంగా నేడు రేపు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తమిళనాడు తీర ప్రాంతంలో గాలుల వేగం గంటకి 40 కి.మీ. నుంచి 50 కి.మీ. దాకా ఉండొచ్చని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు.