భార్యాభర్తల బంధానికి చేటుతెచ్చే సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. భార్యతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సెల్‌ఫోన్లో రికార్డు చేసిన ఓ భర్త 10లక్షల అదనపు కట్నం తీసుకురాకపోతే వాటిని ఆన్‌లైన్‌లో పెడతానని వేధింపులకు గురిచేస్తున్నాడు.
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణి పట్టణానికి చెందిన లేడీ డాక్టర్‌కు గతంలో వివాహమై విబేధాలతో భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చిత్తూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఆమె రెండో వివాహం చేసుకుంది. పెళ్లయిన కొత్తలో సఖ్యతగానే ఉన్న భర్త ఆ తర్వాత తన వికృత రూపం ప్రదర్శించాడు.
కట్నం తీసుకున్నప్పటికీ మరింత కట్నం తీసుకురావాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దంపతులు ఇటీవల ఏకాంతంగా ఉన్న సమయంలో సెల్‌ఫోన్లో వీడియో తీసుకున్నారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న భర్త పుట్టింటి నుంచి రూ.10లక్షలు తీసుకురాకపోతే ఆ వీడియోను ఇంటర్నెట్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు.
అలా చేయొద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా భర్త వినిపించుకోకపోవడంతో చివరికి పోలీసులకు ఆశ్రయించింది. భర్తపై ఆరణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచిన తర్వాత నిందితుడిని వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.