పద్మావత్… తెలుగుబుల్లెట్ రివ్యూ

Padmavat Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బ్యానెర్లు: వయకం, 18 మోషన్ పిక్చర్స్, మరియు బన్సాలి ప్రొడక్షన్స్,
నటీ నటులు : దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్, అదితి రావు హైదరి, జిమ్ సరబ్, రజా మురాద్, అనుప్రియ గోయెంకా తది తరులు నటించారు.
సినిమాటోగ్రఫీ : సుదీప్ ఛటర్జీ
ఎడిటర్ : జయంత్ జదర్, సంజయ్ లీల బన్సాలి, అక్వి అలీ
సంగీతం : సంజయ్ లీల బన్సాలి, సంచిత్ బల్లారా (బ్యాక్ గ్రౌండ్ స్కోర్)
పాటలు : ఏ .ఎం. తురజ్, సిద్ధార్థ్ – గరిమ, స్వరూప్ ఖాన్
దుస్తులు : మాక్సిమా బసు, రింపులే – హరిప్రీత్ నరుల
ఆభరణాలు : తనిష్క్ ,కళా దర్శకుడు: అమిత్ రే
కథ మూలం : మాలిక్ ముహమ్మద్ జయసి
కథ – మాటలు : సంజయ్ లీల బన్సాలి,ప్రకాష్ కపాడియా
నిర్మాతలు : సంజయ్ లీల బన్సాలి, సుధాన్షు వాట్స్, అజిత్ ఆంధ్రే
స్క్రీన్ ప్లే , దర్శకత్వం : సంజయ్ లీల బన్సాలి

పద్మావతి ఇప్పుడు ‘పద్మావత్’ టైటిల్ లో పెద్ద తేడా ఏముందని గొడవ చేస్తున్నారో అర్ధం లేదు. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నపుడు… సెట్ తగలపెట్టి… సినిమాను నిలిపేయాలని గత కొన్నాళ్లుగా ఉత్తర భారతం లో రకరకాల వివాదాలకు కేంద్ర బిందువుగా నిలచిన చిత్రం ‘పద్మవత్’ రాజపుత్ వర్గానికి చెందిన అందరు అల్లర్లు చేయడం, ఈ చిత్రం లో పద్మావతి పాత్ర పోషించిన దీపికా పదుకొనె ని, చిత్ర దర్శకుడు నిర్మాత సంజయ్ లీలా బన్సాలి ని చంపేయాలని వివిధ రకాల స్టేట్మెంట్స్ తో ఉత్తర భారతం దద్ధరిల్లింది. ఈ కారణం తో విడుదల కూడా వాయిదా పడింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ నుండి సుప్రీమ్ కోర్టు కేసుల వరకు వెళ్ళింది. కానీ ఇదే రోజు (23.01.2017) ఉదయం సుప్రీమ్ కోర్ట్ ‘పద్మవత్’ చిత్రానికి అనుకూలం గా సినిమా ని బాన్ చేయడం కుదరదు అని తీర్పు ఇవ్వడం విశేషం. ఎన్నో అవాంతరాలను ఎదురుకుని చివరకు జనవరి 25న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అయ్యింది. అయితే ఈ రోజు 23.01.2017 న 3డి తెలుగు వెర్షన్ ప్రీమియర్ షో హైదరాబాద్ లో సినీ పాత్రికేయులకు ప్రదర్శించారు. ఇంతకు సినిమా లో అభ్యాంతకర సన్నివేశాలు ఏం ఉన్నాయో ఎందుకు గొడవ చేస్తున్నారో రివ్యూ లో ఇప్పుడు చూద్దాం…

కథ:

ఇది కథ అనే బదులు క్రీ.శ.1303 లో జరిగిన చరిత్ర అనాలి. క్రీ.శ. 1540 లో మాలిక్ ముహమ్మద్ జయసి రచించిన పద్య రూపకం పద్మావతి. దీని ఆధారంగా సంజయ్ లీల బన్సాలి, ప్రకాష్ కపాడియా రాసుకున్న కథ. మేవార్ రాజపుత్ వంశానికి చెందిన చిత్తూర్ కోట మహారాజు రతన్ సింగ్ (షాహిద్ కపూర్), ఒకా నొక సందర్భం లో ముత్యాల కోసమని సింహళ దేశానికి వెడతాడు. సింహళ యువరాణి పద్మావతి (దీపికా పదుకొనె) అత్యంత సౌందర్యవతి, అంతే కాదు మంచి రాజకీయ వ్యూహకర్త తాను వేట వెళ్ళినపుడు రతన్ సింగ్ తారసపడతాడు ఇరువురు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకుంటారు. అలా వారి జీవితం ప్రేమమయమై శృంగారం లో ఉండగా, వారి రాజగురువు చాటుగా చూస్తాడు ఇది గమనించి మహారాజు రతన్ సింగ్ అతన్ని దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. దానికి ప్రతీకారం గా చిత్తూర్ కోట ను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ పూని, ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ (రణ్వీర్ సింగ్) చెంతకు చేరుతాడు. రాణి పద్మావతి గుణగణాలు సౌందర్యాన్ని సుల్తాన్ ముందు పొగిడి రెచ్చకొడతాడు. కామాంధుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ దురహంకారంతో పద్మావతిపై మనసుపడతాడు. ఆమెను దక్కించుకోవాలనే తపనతో చిత్తూర్ కోటపై తన అసంఖ్యాకమైన సైన్యంతో యుద్దానికి బయలుదేరతాడు. అలా బయలుదేరిన అల్లావుద్దీన్ ఖిల్జీ రావల్ రతన్ సింగ్ తో యుద్ధం చేశాడా, రతన్ సింగ్ అతన్ని ఎలా ఎదుర్కున్నాడు, రాణి పద్మావతి యుద్ధం చేయకుండానే ఎలాంటి పన్నాగం పన్ని విజయం సాధించింది, అల్లావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మావతి ని లోపరుచుకోవడం కాదు కనీసం ఆమె ప్రత్యక్షంగా చూడగలిగాడా అనేదే ఈ సినిమా కథ.

ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్:

కథకు కీలకమైన అంశం అందాల సౌందర్య రాశి రాణి పద్మావతి. ఆ పాత్రలో అక్షరాలా వంద శాతం రాణి పద్మావతిగా దీపికా పదుకొనె వేషధారణ, ఆత్మగౌరవం, అందం, తెలివి కలిగిన రాణిగా ఆమె అద్భుతం నటించింది. సినిమాని ఉన్నత స్థాయికి తీసికెళ్ళకలిగింది. మహా రాజు రతన్ సింగ్ గా షాహిద్ కపూర్ ఆహార్యం గొప్పగా ఉన్నాయి. ఫస్టాఫ్లో దీపికా, షాహిద్ కపూర్ ల మధ్య నడిచే లవ్ డ్రామా అందంగా ఉంది, ఆకట్టుకుంది. ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఊహించని ట్విస్ట్ సెకండాఫ్ పై ఆసక్తిని రేకెత్తించింది. అలాగే ఎమోషనల్ గా నడుస్తూ రాణి పద్మావతి గొప్పతనం ఎటువంటిదో చూపే ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే మనసుని హత్తుకుంది. దీపికా నటన, విజువల్స్, నైపత్య సంగీతం అన్నీ కలిసి ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంటుంది. వీరిద్దరి నటనతో సినిమా స్థాయి పెరిగి కన్నార్పకుండా చూడాలనిపించేలా తయారైంది.ఇక ఈ చిత్రం లో హైలెట్ ప్రతినాయకుడు అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్వీర్ సింగ్ నటన శభాష్ అనేలా ఉంది. క్రూరత్వం, చాకచక్యం, జిత్తులమారితనం వంటి గుణాల్ని అలవోకగా పలికించి పాత్రకు ప్రాణం పోశారాయన. అతని భార్యగా నటించిన మెహరున్నీసా గా అదితి రావు హైదరి తన పాత్ర మేరకు నటించింది. అల్లాఉద్దీన్ ఖిల్జీ బానిస మాలిక్ కాఫుర్ గా నటించిన జిమ్ సరభ్ కూడా మంచి మార్కులు కొట్టేసాడు.

సాంకేతిక వర్గం:

సినిమాకు మెయిన్ పవర్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి విజన్. ఆయన సన్నివేశాల్ని షూట్ చేశారు అనడంకన్న క్యాన్వాస్ పై ఓ పెయింటింగ్ వేసినట్టు తీర్చి దిద్దారు. మనల్ని టైం మిషన్ లో 13వ శతాబ్దం లోకి తీసు కెళ్లిన అనుభూతి కల్పించాడు. ప్రతి ఫ్రేమును ఎంతో అందంగా, హుందాగా కళ్ళు మిరుమిట్లు గొలిపేలా తీర్చిదిద్దారాయన. బన్సాలీ చిత్రాల్లో మేజర్ గా ఉండే డ్రామానే ఇందులో కూడా ఎక్కువ శాతం ఉంటుంది. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి చరిత్రను వక్రీకరించకుండా, ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండేలా కథ, కథనాల్ని తయారుచేసుకున్నాడు. గొప్ప విజన్ తో సన్నివేశాలని అత్యున్నత సాంకేతికతతో విజువల్ వండర్ అనేలా తీశారు. మంచి ఎమోషనల్ డ్రామాకి తోడు యాక్షన్ శాతాన్ని కూడా ఇంకొంచెం ఎక్కువ మొత్తంలో అందించి ఉంటే బాగుండేది. అన్ని అంశాల దృష్ట్యా దర్శకుడిగా, గొప్ప కథకుడిగా ఆయన విజయాన్ని సాధించారనే చెప్పాలి. ప్రధాన తారాగణం డిజైనర్ మాక్సిమా బసు రూపొందించిన కాస్ట్యూమ్స్ బాగున్నాయి. సంచిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది. ప్రైమ్ ఫోకస్ వారి విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.
సంజయ్ లీల బన్సాలి సంగీతం బాగుంది. అమిత్ రే వేసిన సెట్స్ చాలా గొప్పగా ఉన్నాయి. కెమరామెన్ సుదీప్ ఛటర్జీ ప్రతి ఫ్రేమ్ ను ఎంతో అందంగా చక్కటి లైటింగ్ లో తీర్చిదిద్దారు. గొప్పగా, హుందాగా సినిమా ని చూపించారు. నిర్మాతగా కూడా సంజయ్ లీల బన్సాలి, వియాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పాటించిన నిర్మాణ విలువలు ప్రపంచ హాలీవుడ్ మూవీ స్థాయిలో ఆస్కార్ అవార్డు కి పంపే విధంగా వున్నాయి.

విశ్లేషణ:

మొత్తం మీద చారిత్రక నేపథ్యం నుండి పుట్టిన చిత్రం ‘పద్మావత్’ గొప్ప విజువల్స్ కలిగిన ఎమోషనల్ డ్రామా. సంజయ్ లీలా బన్సాలి కథను వివరించిన తీరు, ఆయన టేకింగ్, కథలో నడిపిన భావోద్వేగపూరితమైన డ్రామా, దీపిక పదుకొనె, రణ్వీర్ సింగ్ ల అసామాన్య నటన, ఇంటర్వెల్ ట్విస్ట్, రాణి పద్మావతి గొప్పతనాన్ని తెలిపే ఎమోషనల్ క్లైమాక్స్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా లాజిక్స్ లేని కీలక సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలలో ‘బాహుబలి’ చిత్రంలోలా యాక్షన్ కంటెంట్ ఉండివుంటే ఇంకా బాగుండేది.ఈ విషయం లో ప్రేక్షకుడిని నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద మంచి ఎమోషనల్ డ్రామా, అత్యున్నత సాంకేతికత కలిగిన ఈ చిత్రం బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను తప్పక అలరిస్తుంది. ఓ హాలీవుడ్ మూవీ ని చూశామా అన్న అనుభూతి ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. ఏది ఏమైనా పద్మావతి లాంటి చారిత్రక నేపథ్యం వున్న సినిమాలు కుల,మత, వర్గ బేధాలు పట్టించుకునే జనాలున్నంతవరకు మన భారత దేశం లో నిర్మించడం కత్తి మీద సాములాంటిదే…భారత సినీ పరిశ్రమలో ఇక ముందు ఇలాంటి సాహసం చేయరేమో అనిపిస్తుంది…..

తెలుగుబుల్లెట్ రేటింగ్ : 3.5/5

 – రాంబాబు వర్మ