పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది మాజీ భార్య రెహమ్ ఖాన్. ఆదివారం ఆమె ప్రయాణిస్తున్న వాహనం గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తనపై జరిగిన హత్యాయత్నం గురించి వివరిస్తూనే.. పనిలో పనిగా మాజీ భర్త ఇమ్రాన్ ఖాన్‌పై ఆమె నిప్పులు కక్కారు.
ఇమ్రాన్ పాలనలో పాకిస్థాన్ పిరికిపందలు, దుండగులు,అత్యాశపరుల రాజ్యంగా మారిందని ఆమె విమర్శలు గుప్పించారు. ‘‘ఆదివారం నా మేనల్లుడి వివాహం నుంచి తిరిగి వస్తుండగా కాల్పులు జరిగాయి. మోటర్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినపుడు కారులో నా వ్యక్తిగత కార్యదర్శి, డ్రైవర్ ఉన్నారు.’’ అని రెహమ్ ఖాన్ ట్వీట్ చేశారు.
కాల్పుల ఘటన తనకు ఆందోళన కలిగించిందని, భయంతో వెహికిల్స్ మారిపోయానని, అదృష్టవశాత్తూ తన సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ఆమె చెప్పారు. అయితే కాల్పులు చేయించింది మాజీ భర్తేనా? అనే విషయంపై స్పందించలేదు. ఇదిలా ఉంటే ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ షామ్స్ కాలనీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో నెటిజనుల నుంచి ఆమెకు మద్దతు వెల్లువెత్తుతోంది.
రెహమ్ ఖాన్ పాక్ సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ కూడా. 2014లో ఇమ్రాన్‌ను పెళ్లాడి.. పట్టుమని పదినెలలు తిరగక ముందే విడిపోయారు. ఆపై పొలిటికల్ క్రిటిక్‌గా మారిపోయి.. మాజీ భర్తపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 2019లో పుల్వామా దాడిపై స్పందిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ దేశ సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడని, భావజాలం,మితవాద విధానాలపై రాజీపడి అధికారంలోకి వచ్చాడంటూ రెహమ్ ఖాన్ బహిరంగ విమర్శలు గుప్పించింది.