ప్రపంచమంతా కరోనా వైరస్ తో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కొందరు మాత్రం ఇదే అదునుగా భావించి తమ పనులు చేసుకుంటూ మోసాలకు పాల్పడుతూ చక్కా ఎంజాయ్ చేస్తున్నారు. అదేమంటే.. తాజాగా పాకిస్థాన్ చాలా జాగ్రత్తగా లోకం మైమరచి ఉన్న సమయంలో సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతుంది. నిషేధిత ఉగ్రవాదుల లిస్ట్ నుంచి వందలమంది పేర్లను తొలగించేసింది. అందులో ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన కరుడు గట్టిన ఉగ్రవాది పేరును కూడా లేపేశారు. ఇప్పుడు పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా ప్రపంచమంతా కరోనావైరస్ ను ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తన పని తాను చక్కపెట్టుకుంటుంది. తరచూ మేం కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఉగ్రవాద బాధితులం అంటూ చెప్పుకొనే పాక్… పరోక్షంగా టెర్రరిజానికి సహకరిస్తుంది. పాక్.. ఉగ్రవాద నిరోదక సంస్థ రూపొందించిన టెర్రరిస్టుల లిస్ట్ నుంచి సుమారు 1800 మంది పేర్లను ఏకంగా తొలగించింది.
అయితే 2008 ముంబై దాడి ఘటనకు ప్రధాన సూత్రధారి, లష్కరే కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ పేర్లను పాకిస్తాన్ తన నిఘా లిస్ట్ నుంచి లేపేసింది. పాకిస్తాన్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ (నాక్టా) నిర్వహించే ఈ నిషేధిత లిస్ట్ ఉగ్రవాద అనుమానితులతో వ్యాపార లావాదేవీలు చేయకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్థలను నిలువరిస్తుంది. టెర్రరిజానికి నిధులు అందకుండా ఉండేందుకు పాక్ ఉగ్రవాద నిరోధక సంస్థ ఈ జాబితాను రూపొందించింది.
అంతేకాకుండా 2018లో ఉగ్రవాదుల జాబితాలో 7600 పేర్లుండగా.. గత 18 నెలల్లో ఈ సంఖ్య 3800కు తగ్గిందని అమెరికాకు చెందిన రెగ్యులేటరీ టెక్నాలజీ కంపెనీ కాసిలమ్ ఏఐ తేల్చి చెప్పింది. ఇక మార్చి నుంచి 1800 పేర్లను ఈ జాబితా నుంచి తొలగించారని సదరు కంపెనీ స్పష్టం చేసింది. కాగా ఉగ్రవాదుల ఆర్థిక పునాదుల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్.. పాక్‌లో ఉగ్రవాద కట్టడికి ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 27 అంశాలు ఉండగా… 14 అంశాల్లో పాక్ పురోగతి సాధించిందని ఎఫ్ఏటీఎఫ్ గతంలో వెల్లడించింది. పాక్ చర్యలపై రివ్యూ జరిపేందుకు ఎఫ్ఏటీఎఫ్ జూన్‌లో మరోసారి సమావేశం కానుంది. దీంతో తాజా పరిణామాలు అమిత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.