కుల‌భూష‌ణ్ ను క‌లుసుకున్న భార్య‌, త‌ల్లి

Pakistan allows Kulbhushan Jadhav's wife, mother to meet him in jail

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నెల‌ల పాటు సాగిన నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. 21 నెల‌ల సుదీర్ఘ విరామం త‌ర్వాత భార‌త మాజీ నేవీ అధికారి కుల్ భూష‌ణ్ జాద‌వ్ ను ఆయ‌న త‌ల్లి, భార్య క‌లుసుకున్నారు. పాకిస్థాన్ లో మ‌ర‌ణ‌శిక్ష ఎదుర్కొంటున్న కుల‌భూష‌ణ్ ను కుటుంబ స‌భ్యులు ఇస్లామాబాద్ లోని పాక్ విదేశీ వ్య‌వ‌హారాల కార్యాల‌యంలో క‌లుసుకున్నారు. వారి వెంట భార‌త డిప్యూటీ హైక‌మిష‌న‌ర్ జేపీ సింగ్ కూడా ఉన్నారు. మొద‌ట కుల‌భూషణ్ భార్య‌, త‌ల్లి ఇస్లామాబాద్ లోని భార‌త దౌత్య‌కార్యాల‌యానికి వెళ్లారు. అక్క‌డి నుంచి పాక్ విదేశాంగ కార్యాల‌యానికి చేరుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు వారు కుల‌భూష‌ణ్ తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా అక్కడ తీవ్ర ఉద్విగ్న వాతావర‌ణం నెల‌కొంది.

అటు పాక్ విదేశాంగ కార్యాల‌యం వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటుచేశారు. యాంటీటెర్ర‌రిజం స్క్వాడ్లు, షార్ప్ షూట‌ర్ల‌ను భ‌ద్ర‌త కోసం నియ‌మించారు. విదేశాంగ కార్యాల‌యం స‌మీపంలో మీడియా , భ‌ద్రతా సిబ్బంది మిన‌హా ఇత‌ర వాహ‌నాల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. 2016 మార్చిలో కుల‌భూషణ్ ను గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌ల కింద పాక్ అధికారులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ లోని ఓ సైనిక‌కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ లో కుల‌భూష‌ణ్ కు మ‌ర‌ణ‌శిక్ష విధించింది. భార‌త్ విజ్ఞ‌ప్తి మేర‌కు అంతర్జాతీయ న్యాయ‌స్థానం ఈ శిక్ష‌పై స్టే విధించింది. కుల‌భూష‌ణ్ ఇరాన్ గుండా బ‌లూచిస్థాన్ లోకి అడుగుపెట్టాడ‌ని..అందుకే అరెస్టు చేశామ‌ని పాక్ ఆరోపిస్తుండ‌గా..ఇరాన్ లో వ్యాపారం చేసుకుంటున్న ఆయ‌న్ను అప‌హ‌రించి పాక్ తీసుకెళ్లార‌ని భార‌త్ వాదిస్తోంది.