ప్రపంచ బ్యాంకు భారీ అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని సరిదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సైనిక, రాజకీయ, వాణిజ్యంలో నాయకుల స్వార్థ ప్రయోజనాలు పక్కకు పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రపంచ బ్యాంకు పాక్ ప్రతినిధి నజీ బాన్ హాస్సిన్ వెల్లడించారు.
దాదాపు 40 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ ధరలు, తగినన్నీ వనరులు లేకపోవడం సహా అనేక ఆర్థిక కష్టాలను పాక్ ఎదుర్కొంటుంది. చిన్నారుల మరణాలు, పిల్లల విద్యా ప్రమాణాల వంటి సూచికలు పాక్ పేదరికం తారా స్థాయికి చేరిందని చెబుతున్నాయని నజీ బాన్ హాస్సిన్ తెలిపారు. పాకిస్తాన్ 2000 నుంచి 2020 మధ్య కాలంలో సగటు వాస్తవ తలసరి వృద్ధి రేటు కేవలం 1.7 శాతం మాత్రమే. దక్షిణాఫ్రికా దేశాలు సగటు తలసరి వృద్ధి రేటులో సగం కంటే తక్కువగానే ఉందని వెల్లడించారు. పాక్ మానవాభివృద్ధి సూచికలో కూడా దక్షిణాసియాలో చిట్టచివరన ఉండటం గమనార్హం.