నవజోత్ సింగ్ సిద్ధూను మంత్రిగా తొలగించిన తర్వాత తిరిగి ప్రభుత్వంలోకి తీసుకోవాలని తనకు పాకిస్తాన్ నుంచి సందేశం వచ్చిందని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారు. సిద్ధూ తమ ప్రధానికి పాత స్నేహితుడని, అందువల్ల ఆయన్ను తిరిగి పదవిలోకి తీసుకోవాలని తనను కోరారన్నారు. ఈ విషయమై స్పందించేందుకు సిద్ధూ నిరాకరించారు. సిద్ధూకు పదవినిస్తే ఇమ్రాన్ ఖాన్ సంతోషిస్తారని తనకు చెప్పారని అమరీందర్ తెలిపారు.
అయితే సిద్ధూ అసమర్ధుడనే తాను తొలగించానని, 70 రోజులు పదవీలో ఉండి ఆయన కనీసం ఒక్క ఫైలును చూడలేదని దుయ్యబట్టారు. తర్వాత తనకు పాకిస్తాన్ నుంచి రాయబారాలు వచ్చాయని చెప్పారు. రెండోమారు పదవి ఇచ్చాక పనితీరు కనబరచకపోతే అప్పుడు తొలగించమని తనను పాకిస్తాన్ వర్గాలు కోరాయన్నారు. అయితే ఎవరి నుంచి ఈ సందేశం వచ్చిందో చెప్పలేదు. సరిహద్దు అవతల నుంచి భారీగా భారత్‌లోకి ఆయుధాలు అక్రమంగా వస్తున్నాయని అమరీందర్ ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రమ ఇసుక మైనింగ్‌తో సంబంధం ఉన్న ఎంఎల్ఏలకు సిద్ధూ ఆశ్రయమిచ్చాడని అమరీందర్ ఆరోపించారు. ఇందులో సిద్ధూ సొంత ప్రయోజనాలున్నాయన్నారు. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడిని కోరితే ఆయన నిరాకరించడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక కూడా తనపై సిద్దూ ఆరోపణలు గుప్పించడం చూస్తే, ఆయన ఎంత అభద్రతా భావనతో ఉన్నారో అర్ధమవుతోందన్నారు.