వేధింపులతో పంచాయతీ కార్యదర్శి సూసైడ్

తెలంగాణలో ఘోరం వెలుగు చూసింది. అదేమంటే.. ఓ పంచాయతీ కార్యదర్శి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘నేను తీసుకున్న ఈ నిర్ణయంతో ఏ ఒక్కరికీ సంబంధం లేదు. కుటుంబసభ్యులు, స్నేహితులను ఇబ్బంది పెట్టొద్దు. ఈ ఉద్యోగం, జీవితం ఇలా గడపటం ఇష్టం లేకే నేను చనిపోతున్నా. నా మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అవయవాలను ఇతరులకు దానం చేయండి’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ పంచాయతీ కార్యదర్శి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ ఎస్‌ఐ రమేశ్.. కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలను బట్టి చూస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అదేమంటే.. మహబూబ్‌నగర్‌లోని మర్లులో నివాసం ఉంటున్న పంచాయతీ కార్మదర్శి అరుణ్‌చంద్ర(25) గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఉదయం 6.30 ప్రాంతంలో గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న తమ్ముడిని చూసిన ఫణీంద్రబాబు గట్టిగా అరుపులు కేకలు పెట్టడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలకొట్టి కిందికి దించి చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.

అయితే అరుణ్‌చంద్ర కొంతకాలంగా హన్వాడ మండలం యారోనిపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. సర్పంచ్‌ సుధారాణి భర్త అనంతరెడ్డి, వార్డుసభ్యుడు తిరుపతయ్య ఆరునెలలుగా వేధించటంతో పాటు విధులకు ఆటంకం కలిగిస్తున్నారని మానసికంగా చాలా ఆవేదనకు గురై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌ 25 నుంచి మే 1వ తేదీ వరకు విధులకు వెళ్లడం లేదని.. అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.