తల్లి అయితే గాని స్త్రీ జన్మకు పరిపూర్ణత లభించదనుకునే సమాజం మనది. ఇక మాతృత్వం కోసం ప్రతి మహిళ పరితపిస్తుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. అమ్మ అని పిలుపించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. దురదృష్టం కొద్ది పిల్లలు పుట్టే అవకాశం లేని వారి బాధ వర్ణానాతీతం. అయితే ప్రస్తుతం వీరిపాలిట వరంగా మారింది కృత్రిమ గర్భధారణ.
కృత్రిమ గర్భధారణ ఎందరో మహిళలకు మాతృత్వం అనే వరాన్ని తిరిగి అందిస్తుంది. ఇదంతా బాగానే ఉంది.. కానీ దీనిలో ఏ మాత్రం తేడా జరిగినా.. ఫలితం దారుణంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు అమెరికాకు చెందిన ఓ జంట. ఇందుకు కారణమైన ఐవీఎఫ్ క్లినిక్పై కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..
అమెరికాకు చెందిన డఫ్నా, అలెగ్జాండర్ కార్డినాల్ దంపతులకు వివాహం అయ్యి చాలా కాలమయ్యింది కానీ పిల్లలు కలగలేదు. దాంతో వాళ్లు కృత్రిమ గర్భధారణ ద్వారా బిడ్డను కనాలనుకున్నారు. ఈ క్రమంలో తమ ఇంటికి సమీపంలో ఉన్న ఓ ఐవీఎఫ్ కేంద్రాన్ని సంప్రదించారు. ఐవీఎఫ్ ద్వారా గర్భవతి అయిన డఫ్నా.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ రంగు, ఒత్తైన నల్లటి జుట్టు.. చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. తమ కుటుంబంలో ఎవరికి ఈ చిన్నారి లాంటి శరీర ఛాయ, జుట్టు లేవు.
అయితే బిడ్డ పుట్టిన సంతోషంలో ప్రారంభంలో వారు ఇవేం పట్టించుకోలేదు. కానీ బిడ్డ పెరుగుతున్న కొద్ది వారిలో అనుమానం బలపడసాగింది. ఈ క్రమంలో డఫ్నా దంపతులు వారి బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయించారు. ఫలితాలు వారిద్దరిలో ఎవరితో కూడా సరిపోలేదు. దాంతో వారి అనుమానం మరింత బలపడింది.
ఈ క్రమంలో వారు తాము సంప్రదించిన ఐవీఎఫ్ కేంద్రానికి వెళ్లి.. విషయం చెప్పి.. నిలదీయగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. డఫ్నా దంపతులు ఐవీఎఫ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే మరో జంట కూడా కృత్రిమ గర్భధారణ కోసం పక్కనే ఉన్న క్లినిక్కు వచ్చారు. అయితే ఈ రెండింటిలో పని చేసేది ఒక్కడే డాక్టర్. ఫలితంగా సదరు డాక్టర్ పొరపాటున ఇరువురి పిండాలను తారుమారు చేశాడు.
అంటే డఫ్నా దంపతుల పిండాన్ని వేరే వారి గర్భంలో.. వారి పిండాన్ని డఫ్నా గర్భంలో ప్రవేశపెట్టాడు. జుట్టు, శరీర ఛాయ వేరుగా ఉండటంతో అనుమానం రావడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో డఫ్నా దంపతులు సదరు ఐవీఎఫ్ కేంద్రం మీద కేసు పెట్టారు. తమ జన్యుపరమైన బిడ్డను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో రెండు జంటలు తమ తమ జన్యుపరమైన బిడ్డలను పరస్పరం మార్చుకుని… సొంత బిడ్డలతో ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా డఫ్నా దంపతులు తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. మేం వేసిన లాసూట్ ద్వారా భావోద్వేగ నష్టాలు, పరిహారం,ఆస్తి నష్టాలు, అలాగే అనేక రకాల ఖర్చులను కోరుతోంది.