ఆడ శిశువును విక్రయించిన తల్లిదండ్రులు

ఆడ శిశువును విక్రయించిన తల్లిదండ్రులు

మూడురోజుల ఆడ శిశువును విక్రయించిన తల్లిదండ్రులను, కొనుగోలు చేసిన అక్కాచెల్లెలిని, ఆశావర్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఆలూరుకు చెందిన దుర్గాప్రియ, శ్రీనివాస్‌ దంపతులు కమలానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

గాంధీ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం దుర్గాప్రియకు కూతురు జన్మించింది.అయితే దుర్గాప్రియ, ఆమె భర్త శ్రీనివాస్‌లు బాలనగర్‌కు చెందిన కవితకు రూ.80 వేలకు విక్రయించేందుకు ఆశావర్కర్‌ బాషమ్మ ద్వారా ఒప్పందం కుదుర్చుకుని విక్రయించారు. తన సోదరి ధనమ్మకు పిల్లలు పుట్టరని తేలడంతో అక్క కవిత ఈ కొనుగోలు చేసింది. విషయం తెలుసుకున్న దుర్గాప్రియ తల్లి బాలగోని రాజేశ్వరీ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసునమోదు చేసుకున్న సీఐ సత్యనారాయణ విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని చిన్నారిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పజెప్పారు. శిశువును విక్రయించిన తల్లిదండ్రులు దుర్గాప్రియ, శ్రీనివాస్, ఆశావర్కర్‌ బాషమ్మ, కొనుగోలు చేసిన కవిత,ఆమె సోదరి ధనమ్మలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు