సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఎంపీలు కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. సామాజిక దూరం అనే మాటే మర్చిపోయారు. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల ఎంపీలదీ అదే తీరు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం సెంట్రల్ హాల్‌లో ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఈ క్రమంలో మొదటి రెండు వరుసల్లో ఆసీనులైన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు మాత్రమే సామాజిక దూరం పాటించారు.
మూడో వరుస నుంచి కూర్చున్న ఎంపీలు కోవిడ్–19 ప్రొటోకాల్‌ను లెక్కచేయలేదు. వీరిలో కొందరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. కొన్ని బెంచీల్లో ఐదుగురు మాత్రమే కూర్చోవాల్సి ఉండగా, ఏడుగురు కనిపించారు. ఇక చాలామంది ఎంపీలు మాస్కులు కూడా కిందకు దించేశారు. మాస్కులు సక్రమంగా ధరించకుండానే ఒకరితో ఒకరు మాటల్లో మునిగిపోయారు. కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం రాజ్యసభ, సా యంత్రం లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి.