లోక్ స‌భ‌ వాయిదా… రేప‌టితో ముగియ‌నున్న స‌మావేశాలు

Parliament Postponed again

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోక్ స‌భలో ప‌ద‌కొండో రోజు పాత‌క‌థే పున‌రావృత‌మ‌యింది. అవిశ్వాసంపై చ‌ర్చ జ‌ర‌ప‌కుండానే స్పీక‌ర్ సుమిత్రామ‌హాజ‌న్ స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు. ఈ ఉద‌యం 11 గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మైంది. వెంట‌నే స్పీక‌ర్ ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. అయితే స్పీక‌ర్ చైర్ లో కూర్చునే స‌మ‌యానికే అన్నాడీఎంకె ఎంపీలు వెల్ లోకి చేరుకున్నారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ నినాదాలు చేశారు. స‌భ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించాల‌ని స్పీక‌ర్ కోరినా వారు వినిపించుకోలేదు. స‌భ్యులు నినాదాలు చేస్తున్నా… స‌హ‌క‌రించాల‌ని రోజూ కాసేపు విజ్ఞ‌ప్తిచేసే స్పీక‌ర్ ఇవాళ మాత్రం స‌భ‌ను కొన‌సాగించ‌డానికి ఆస‌క్తి చూప‌లేదు. అర‌నిమిషంలోనే స‌భ‌ను మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల‌కు వాయిదావేసి వెళ్లిపోయారు. స‌భ తిరిగి ప్రారంభ‌మ‌యిన త‌ర్వాత కూడా ప‌రిస్థితిలో మార్పు రాలేదు. అన్నాడీఎంకె ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళ‌న చేప‌ట్టారు. స‌భ ఆర్డ‌ర్ లో ఉంటేనే అవిశ్వాసంపై చ‌ర్చ‌ను కొన‌సాగిస్తామ‌ని స్పీక‌ర్ చెప్పారు. అయిన‌ప్ప‌టికీ స‌భ్యులు ఆందోళ‌న‌లు ఆప‌లేదు. దీంతో స‌భ‌ను రేప‌టికి వాయిదావేయ‌నున్న‌ట్టు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు.

పార్ల‌మెంట్ స‌మావేశాలు రేప‌టితో ముగియ‌నున్న నేప‌థ్యంలో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌రుగుతుందా. లేదా అన్న‌దానిపై ఉత్కంఠ నెల‌కొంది. అటు రాజ్య‌స‌భ ఆందోళ‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లింది. విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తూ టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు ఆందోళ‌న చేప‌ట్టారు. చైర్మ‌న్ పోడియాన్ని చుట్టుముట్టి ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ నినాదాలు చేశారు. అన్ని అంశాల‌పై స‌భ‌లో చ‌ర్చిద్దామ‌ని, స‌భ్యులు ఆందోళ‌న విర‌మించి స‌భా నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు కోరారు. స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న చూసి దేశ‌మంతా నివ్వెర‌పోతోంద‌న్నారు. ఏపీ, కావేరీ యాజ‌మాన్య బోర్డు, ద‌ళితుల‌పై దాడి త‌దిత‌ర అన్ని అంశాపై చ‌ర్చిద్దామ‌ని, స‌భ్యులు స‌హ‌క‌రించాల‌ని ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తిచేశారు. ఆందోళ‌న‌ల వ‌ల్ల దేశాభివృద్ధికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో బిల్లులు ఆమోదానికి నోచుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. అయినా స‌భ్యులు విన‌కుండా ఆందోళ‌న కొన‌సాగించ‌డంతో స‌భ‌ను వాయిదావేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.