అనుకున్నదే అయింది, పార్లమెంట్ నిరవధిక వాయిదా

Parliament Sessions Completed today

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అనుకున్నదే అయ్యింది. గత 12 రోజులుగా వాయిదాలు వేస్తూ వచ్చిన లోక్ సభ చివరి రోజున కూడా అంతే చేశారు. ఇప్పటి వరకు బెల్లం కొట్టిన రాయిలా ఎటువంటి కదలికా లేకుండా ఉన్న అధికార బీజేపీలో చివరి రోజు సభలో కూడా ఎటువంటి చలనమూ కనిపించ లేదు. గత కొద్ది రోజులుగా పార్లమెంట్ లో ఆంధ్రా ఎంపీలు ప్రత్యేక హోదా కోసం, తెలంగాణా ఎంపీలు వర్గీకరణ చట్టబద్దత కోసం, అన్నాడీఎంకే ఎంపీలు కావేరి జలాల విషయంలో ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈరోజు స్పీకర్ సభలోకి రావడానికి ముందే అన్నాడీఎంకే ఎంపీలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు అయితే సభ మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఏఐఏడీఎంకే సభ్యుల ఆందోళనని సాకుగా చూపి అవిశ్వాస తీర్మానం పై ఎటువంటి ప్రకటనా చేయకుండానే సభని నిరవధికంగా వాయిదా వేశారు.

11 గంటలకు సభ ప్రారంభమైన తరువాత అప్పటికే వెల్ లో ఉన్న అన్నాడీఎంకే సభ్యులు తమ కావేరీ నదీ జలాల బోర్డుని గురించి నినాదాలు చేశారు. తాను ఓ ప్రకటన చేయాలని అనుకుంటున్నానని, సభను కాసేపు శాంతంగా ఉండనివ్వాలని సుమిత్రా మహాజన్ సభ్యులని కోరారు. అయితే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన విషయమని భావించి అందరు సభ్యులు మౌనం దాల్చారు. అయితే ఆమె బడ్జెట్ మలిదశ సమావేశాలపై ఆమె ఓ ప్రకటన చేశారు. సభ నడిచిన రోజులు, సమావేశపు వివరాలు, ఆమోదం పొందిన బిల్లుల గురించి క్లుప్తంగా చదివి వినిపించిన ఆమె సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు 11.15 గంటల సమయంలో ప్రకటించారు. ఆపై వందేమాతరం గీతం ముగిసిన ఆమె పోడియం దిగి వెళ్లిపోయారు. మరోపక్క రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేక హోదాకోసం టీడీపీ ఎంపీలు, కావేరి బోర్డు కోసం అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.