సాయం చేస్తున్న పటాన్ సోదరులు

సాయం చేస్తున్న పటాన్ సోదరులు

కరోనా వల్ల అతలాకుతలం అయిన ఢిల్లీ ప్రజలకు తనవంతు సాయం అందించేందుకు భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ముందుకొచ్చాడు. మహమ్మారి వల్ల పూట గడవడం కూడా కష్టమైన దక్షిణ ఢిల్లీ ప్రజలకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనున్నట్లు పఠాన్‌ తెలిపాడు. క్రికెట్‌ అకాడమీ ఆఫ్‌ పఠాన్స్‌ (సీఏపీ) ద్వారా ఈ సేవా కార్యక్రమం జరగనున్నట్లు అతను స్పష్టం చేశాడు.

‘ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశవ్యాప్తంగా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం ప్రస్తుతం మన ముందున్న కనీస బాధ్యత. అందుకే సీఏపీ ద్వారా దక్షిణ ఢిల్లీలో ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యా’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్వీట్‌ చేశాడు. ఇప్పటికే ఇర్ఫాన్‌ పఠాన్, అతని సోదరుడు యూసుఫ్‌ పఠాన్‌ 4 వేల మాస్క్‌లను అందజేశారు. మార్చిలో రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఇర్ఫాన్, యూసుఫ్‌ పఠాన్‌ కరోనా బారిన పడి కోలుకున్నారు.