Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి… యూపీఏపై స్కాముల ప్రభుత్వం ముద్రవేసిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో పాటియాలా సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్కాములో కీలక నిందితులుగా జైలు శిక్ష కూడా అనుభవించిన డీఎంకె అధ్యక్షుడు కరుణానిధి కుమార్తె కనిమొళి, కేంద్ర మాజీ టెలికాం మంత్రి ఎ. రాజాలను నిర్దోషులుగా ప్రకటించింది. వారితో పాటు కేసులోని మిగిలిన నిందితులు 15మందినీ నిర్దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాధారాలు లేనందునే అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని కోర్టు తెలిపింది. నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయిందని, నిందితులను దోషులగా ప్రకటించేందుకు సరైన ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంది.
బోఫోర్స్ కుంభకోణం తర్వాత దేశంలో అంత సంచలనం సృష్టించిన స్కామ్ 2జీనే. ఈ కుంభకోణం వల్ల దేశ ఖజానాకు రూ.1.76లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. దీనిపై సీబీఐ, ఈడీ వేర్వేరుగా కేసులు పెట్టాయి. కాగ్ నివేదిక తర్వాత 2010లో ఎ. రాజాను అప్పటి ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. రాజాతో పాటు డీఎంకె ఎంపీగా ఉన్న కనిమొళి సహా 17 మంది నేతలు, కార్పొరేట్ సంస్థల అధికారులపై చార్జిషీట్ దాఖలైంది. 2011లో రాజా, కనిమొళిని అరెస్టు చేశారు. కనిమొళి ఆరు నెలల పాటు, రాజా ఏడాదిపాటు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ఓటమికి దారితీసిన కారణాల్లో 2జీ కుంభకోణం కూడా ఒకటి. ఇంటి సంచలనాత్మక కేసులో నిందితులు నిర్దోషులుగా తేలడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేస్తామని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కోర్టు తీర్పుతో డీఎంకె శ్రేణులు సంబరాల్లో మునిగాయి. ఈ తీర్పుతో న్యాయం గెలిచిందని, ఇది తమిళనాడు ప్రజలందరికీ సంతోషకరమైన వార్తని డీఎంకె నేతలంటున్నారు. తీర్పు వెలువడగానే కనిమొళి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న రాజాను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు మద్దతిచ్చిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.