Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంద్ర ప్రదేశ్ కి జరిగిన అన్యాయాన్ని దేశ వ్యాప్తంగా ఎండగట్టి ఎలా అయినా కేంద్రంలో కదలిక తీసుకురావాలి అని చంద్రబాబు ప్రయత్నం చేస్తుంటే మరో వైపు వైఎస్ జగన్ కూడా తమ పార్టీ తరపున నాం కే వాస్తే పోరాటాలు చేయిస్తున్నారు. ఇక మిగిలి ఉన్న పవన్ కళ్యాణ్ కూడా తనతో కలిసి వచ్చే వామపక్షాలు, ఇతర రాజకీయ నిరుద్యోగులని కలుపుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
హోదా పోరు కోసం ఆయన ఈ నెల 4, 5 తేదీల్లో విజయవాడలో పర్యటించనున్నారని తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా 4న వామపక్షాలతో సమావేశమయి చర్చించనున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అదే రోజున ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
తదుపరి జనసేన పార్టీ కి సంబంధించిన ప్రెసిడెంట్ కమిటీలతోనూ పవన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ సభ్యులను పార్టీ కార్యవర్గంలోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలకు మాత్రమే పరిమితమైన ప్రెసిడెంట్ కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది.
పవన్ ఏ పని చేసినా.. దాన్ని మధ్యలోనే వదిలేస్తారన్న విమర్శలు లేకపోలేదు, మొన్నటికి మొన్న జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీపై కూడా జయ ప్రకాష్ నారాయణ వంటి వారే ఈ మాటలు అన్నారు. ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ వేసి రెండు మూడు సార్లు సమావేశం అయి ఏమి సాధించారు అని ప్రజలు అనుమాన పడకముందే, మరో ఉద్యమ పోరు లోకి దిగాలని పవన్ యోచిస్తున్నట్టు ఉంది.