పవన్ సెంటిమెంట్స్…ఆరోజునే నామినేషన్స్ !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్చి 21, 22 తేదీల్లో నామినేషన్ వేయనున్నారు. 21న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య గాజువాకలో పవన్ నామినేషన్ దాఖలు చేస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య భీమవరంలో రిటర్నింగ్ అధికారికి పవన్ నామినేషన్ పత్రాలు అందజేస్తారు. ఈ విషయం పార్టీ వర్గాలు తెలిపాయి. గాజువాకలో జనసేన బలంగా ఉంది. ఇక్కడ ఆ పార్టీకి లక్ష సభ్యత్వాలు నమోదయ్యాయి. కాబట్టి గాజువాక నుంచి పవన్ బరిలో నిలుస్తున్నారు. మరి పవన్ భీమవరం ఎంచుకోవడానికి మరో సెంటిమెంట్ కారణమని చెబుతున్నారు. 1989 నుంచి భీమవరంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది. 1989లో కాంగ్రెస్ నుంచి అల్లూరి సుభాష్ చంద్రబోస్ విజయం సాధించారు. 1994, 1999లలో టీడీపీ అభ్యర్థి పెనుమత్స వెంకట నర్సింహ రాజు గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ నుంచి గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. 2009లో ఆయన్ను కాదని పులపర్తి రామాంజనేయుులికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా ఆయన గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. దీంతో భీమవరంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం అనే సెంటిమెంట్ ఏర్పడింది. మరి పవన్ ఏమవుతారో వేచి చూడాలి.