సినీనటుడు పోసాని కృష్ణ మురళి ఇంటిపై బుధవారం కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అమీర్‌పేటలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఆయన నివాసంపై మంగళవారం అర్ధరాత్రి కొందరు రాళ్లు విసిరారు. అంతేకాకుండా పోసానిని దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. ఈ ఘటనతో వాచ్మెన్ కుటుంబం భయాందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిగూడలో పోసానికి ఇల్లుంది. అయితే 8 నెలలుగా ఆయన కుటుంబంతో సహా వేరే చోట నివాసముంటున్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో వాచ్మెన్ కుటుంబం నివాసముంటోంది.
గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా రాళ్లదాడికి పాల్పడటంతో వాచ్మెన్ కుటుంబం భయాందోళనకు గురైంది. ఈ ఘటనపై బుధవారం వారు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. రాళ్లదాడిని తాము ప్రత్యక్షంగా చూశామని కొందరు స్థానికులు చెబుతున్నారు. పోసాని ఇంట్లో ఉన్నారనుకునే దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
సినీ టిక్కెట్ల విషయమై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం విమర్శలు చేయడంపై పోసాని తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం పోసాని, జనసేన కార్యకర్తల మధ్య యుద్ధంగా మారిపోయింది. ఆయనపై పలు పోలీస్‌స్టేషన్‌లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పోసానిని తెలంగాణ నుంచి బహిష్కరించాలంటూ జనసేన వీరమహిళ కావ్య మంగళవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు ఫిర్యాదు చేశారు.