పవన్ కి 10 పోయి 99 దక్కడంలో రాజకీయ రహస్యం .

Pawan Kalyan Bought Telugu 99 News Channel

మొన్నామధ్య శ్రీరెడ్డి ఎపిసోడ్ తో టీవీ 9, abn ఆంధ్రజ్యోతి చానెల్స్ మీద పెద్ద యుద్ధమే చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించాలంటే మీడియా సపోర్ట్ అవసరం అని గుర్తించారు. అప్పటికప్పుడు ఏదో ఒక ఛానల్ తమ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గ ఛానల్ కోసం వెదికినప్పుడు ముందుగా 10 టీవీ మీద పవన్ కళ్ళు పడ్డాయి. రాయబారాలు, బేరసారాలు నడిచాయి. ఇక అంతా ఫైనల్ అనుకున్న సమయంలో సీన్ మారిపోయింది. 10 టీవీ బదులు 99 టీవీ తో జనసేన ఒప్పందం ఖరారు అయ్యింది. అయితే తమాషా ఏంటంటే… డీల్ చెడిన 10 టీవీ సిపిఎం, డీల్ కుదిరిన 99 టీవీ సిపిఐ ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం. పైగా ఈ రెండు పార్టీలు రాజకీయంగా కూడా ఇప్పుడు జనసేనతో కలిసి నడుస్తున్నాయి. అయినా ఓ ఛానల్ తో డీల్ దాకా వెళ్లిన తర్వాత మార్పులు ఎందుకు వచ్చాయి అన్నదే చాలా మందికి అంతు పట్టని ప్రశ్న.

ఈ విషయం గురించి కాస్త లోతుగా వెళితే కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. 10 టీవీ జనసైన్యంలో చేరకుండా వైసీపీ అధినేత జగన్ కి సన్నిహితుడైన ఓ పారిశ్రామికవేత్త అడ్డం పడినట్టు తెలుస్తోంది. ఆయన జనసేన కన్నా 10 టీవీ కోసం భారీ ఆఫర్ ముందుకు తెచ్చారట. దీంతో ఆ యాజమాన్యం కూడా జనసేన ఆఫర్ ని లైట్ తీసుకుందట. అందుకే ఆ డీల్ ఆగిపోయిందట. ఇక అప్పటికే పీకల్లోతు ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న 99 యాజమాన్యం వెంటనే రంగంలోకి దిగి జనసేన తో సంప్రదింపులు జరిపిందట. దీంతో డీల్ క్లోజ్ అయ్యిందట. అయితే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జనసేన వెంట నడుస్తున్నామని చెప్పుకుంటున్న వామపక్షాలు సైతం ఆర్ధిక వ్యవహారాల్లో మాత్రం లాభసాటిగా వున్న వైపే మొగ్గుజూపడం చూస్తుంటే జనానికి తగిలే షాక్ మాట ఏమిటో కానీ పవన్ కి మాత్రం వార్నింగ్ బెల్స్ వినిపించి ఉంటాయి.