సినిమాల్లో పవర్ స్టార్ అని బిరుదును స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ.. రాజకీయాల్లో పవర్ సంపాదించాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఆ పవర్ ని మాత్రం పవన్ అందుకోలేక చతికిల పడ్డారు. మొదటి నుంచి పార్టీకి ఒక వ్యూహం, ఒక ప్రణాళిక అంటూ లేకుండా పవన్ ముందుకు తీసుకు వెళ్ళడంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. మొదట్లో తన అన్న పవన్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై పవన్ తన సన్నిహితుల దగ్గర తీవ్రస్థాయిలో విమర్శలు చేశారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు కూడా పవన్ తాను పార్టీని నడిపించే లేక బీజేపీతో పొత్తుకు వెళ్లడంపైనా అదే రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి.
బీజేపీ మాత్రం ప్రస్తుతానికి జనసేనతో పొత్తు కొనసాగిస్తున్నా ఆ పార్టీని విలీనం చేసుకోవాలనే ఆలోచనతో ఉంది. అయితే పవన్ మాత్రం బీజేపీని ఉపయోగించుకుని ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.కానీ బిజెపి పవన్ ఊహించుకున్నట్టుగా వ్యవహరించడం లేదు. అసలు పవన్ చెప్పాడని జగన్ తో కయ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పెట్టుకునే సాహసానికి ఒడిగట్టదు. అసలు ఆ అవసరం కూడా బీజేపీకి లేదు. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర అనుభవాలతో బిజెపి క్లారిటీ గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి బలహీనపడుతున్న క్రమంలో 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీతో తగాదా పెట్టుకోవడం కంటే సన్నిహితంగా ఉండడం వల్ల ఆ పార్టీకి ఎక్కువ కలిసి వస్తుంది.
అది కాకుండా మరి కొద్ది రోజుల్లో వైసీపీకి ఆరు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. అందుకే వైసీపీకి తెరవెనుక బిజెపి మద్దతు పలుకుతున్నట్లు అనేక సందర్భాల్లో బయట పడింది. చంద్రబాబుతో బిజెపి పొత్తు పెట్టుకుంటుందా అంటే అది లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఏపీలో ఏ పరిస్థితిలో ఉందో బిజెపికి తెలుసు. ఇక అవసరం ఉంటే ఒకలా.. అవసరం తీరాక మరోలా చంద్రబాబు వ్యవహరిస్తారని బిజెపి పెద్దలకు అనుభవపూర్వకంగా తెలిసింది. ఈ విషయాలన్నీ ముందుగా అంచనా వేయకుండా… తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను కాబట్టి తాను వ్యతిరేకిస్తున్న వైసీపీని బిజెపి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుందనే భ్రమలో పవన్ ఉండిపోయాడు. పవన్ కు సరైన సలహాలు, సూచనలు ఇచ్చే వారు లేకపోవడం వల్లే రాజకీయంగా వెనుకబడిపోతున్నడు అనే విమర్శలు సైతం పెద్ద ఎత్తున మూటగట్టుకున్నాడు.