జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాయలసీమపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. రాయలసీమలో బలమైన క్యాడర్ ఉందని పేర్కొంటూ వారిని కాపాడుకునేందుకు త్వరలోనే అక్కడ పర్యటించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తాజాగా ఆయన టూర్ ఖరారైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 1వ తేదీ నుంచి రాయలసీమలో పర్యటించనున్నారని సమాచారం. అయితే, ఈ టూర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాలను టార్గెట్ చేసుకున్నారు.
జనసేన పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 1 వ తేదీ నుంచి ఆరు రోజులపాటు రాయలసీమ జిల్లాల పర్యటన ఖరారైంది. చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటిస్తారు. రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు చేపడతారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనలో, సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న ప్రతినిధులను పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో కలుసుకొని వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు.