జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. తుఫాను ధాటికి నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. పలు చోట్ల సభలు నిర్వహించి రైతుల్లో భరోసా నింపుతున్నారు.
ఇందులో భాగంగా నిర్వహించిన ఓ సభలో పవన్ కళ్యాణ్ తాను విద్యార్థి దశలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను విశ్లేషించారు. చిన్నతనంలో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించానని, అప్పుడు తన ఇంట్లో వాళ్లు ఆపారని గుర్తు చేసుకున్నారు. కష్టాలు చుట్టిముట్టినప్పుడు చావు చాలా సుఖంగా ఉంటుందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటారని వివరించారు.
పవన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘ఎవరైనా సరే జీవితం ఆశాజనకంగా లేదు అనుకున్న పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటారు. నాకు ఎవరూ లేరు, నన్ను సమాజం పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు.. వాళ్లకు చచ్చిపోతే చాలా రిలీఫ్ గా ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ వరుసగా రెండు, మూడు సార్లు చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు.. ఇక బతకడం వేస్ట్ అని భావించి, ప్రయత్నించాను. అయితే ఇంట్లో వాళ్లు కొందరు నా ప్రయత్నాన్ని ఆపేశారు.
అప్పుడు నాకు అనిపించింది ఏమంటే.. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చావు చాలా సుఖంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమస్యను తప్పించుకోవచ్చు. చావు అంటే తప్పించుకోవడమే. ఇంకేమీ దారి లభించక, చావాలని నిర్ణయించుకుంటారు. ఇప్పుడు తుఫాను వల్ల నష్టపోయిన రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా నిరాశా నిస్పృహలో ఉన్న రైతుల్లో భరోసా నింపేందుకు నేను వచ్చాను. మా దగ్గరేమీ వందల కోట్ల డబ్బు లేదు. కానీ, మీకు మేము ఉన్నాం అనే ధైర్యం ఇస్తే, వారిని ముందుకు నడిపిస్తుంది.’’ అని పవన్ ఆసక్తిక విషయాలు చెప్పారు.