టీడీపీ ఒక గజినీ

pawan kalyan tweets on chandrababu

గత కొద్ది కాలంగా టీడీపీ మీద వరుస విమర్శలు చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా మరో సారి టీడీపీ వ్యవహారశైలిని తప్పుబడుతూ ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. అవిశ్వాసం పరిణామాలపై జనసేన అధినేత పవన్ స్పందిస్తూ టీడీపీని తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ‘గజినీ’ సినిమాలో హీరో మాదిరి తెలుగుదేశం పార్టీ కూడా మెమొరీ లాస్ తో బాధపడుతోందని ఎద్దేవా చేశారు. గజినీ సినిమా హీరో ‘షార్ట్ టైం మెమొరీ లాస్‌’తో ఎలా బాధపడతాడో.. టీడీపీ కూడా ‘కన్వినియెంట్ మెమొరీ లాస్ సిండ్రోమ్’తో బాధపడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.

ఏపీ అంటే కేవలం 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాదని వాళ్లు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. ఇప్పుడు కొత్త తరం వచ్చిందని, వారిని మౌనంగా ఉండే ప్రేక్షకులుగా అంచనా వేయవద్దని చెప్పారు. ప్రత్యేక హోదాను నీరుగార్చింది ఎవరని ? బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుంది ఎవరని ప్రశ్నించారు. టీడీపీ ఒక్కసారి గతాన్ని గుర్తుచేసుకుని మాట్లాడాలని పవన్ ట్వీట్ చేశారు. మీ సౌలభ్యం కోసం రేపు ఇప్పుడున్న వైఖరిని మార్చుకోరన్న గ్యారంటీ ఇవ్వగలరా అని టీడీపీని పవన్ సూటిగా ప్రశ్నించారు. జనసేన సొంత ప్రయోజనాల కోసం పనిచేయదని, ఏపీ ప్రజల హక్కు కోసం పోరాడుతుందని తెలిపారు. ఈతరం యువత మేల్కోవాలని, మౌనం పనికిరాదని పవన్ ట్వీట్ చేశారు.