Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ లో నందమూరి, మెగా క్యాంపు ల మధ్య పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పోటీ కులాల మధ్య పోటీగా మారినప్పుడు ఏమిటబ్బా ఇది అనిపించేది. అయితే కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయి. ఈ క్యాంపుల నుంచి కొత్త తరం హీరోలు వచ్చే కొద్దీ పాత వాసనలు పక్కకి పోతున్నాయి.
సినిమా దగ్గర పోటీ పోటీయే గానీ దాని ప్రభావం వ్యక్తిగత సంబంధాల మీద ఉండదని ఇప్పటికే చాలా సార్లు రుజువు అయ్యింది. ఇటీవల ఎన్టీఆర్ జైలవకుశ పెద్ద హిట్ అయితే రామ్ చరణ్ పెద్ద పార్టీ ఇచ్చాడు. మారుతున్న పరిస్థితులకి ఇంత కన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది ?
ఇప్పుడు అలాంటిదే ఇంకో విషయం. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త సినిమా రేపు లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. 2018 ఫిబ్రవరి లో రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యే ఈ సినిమాకి ముహూర్తం బాగుందని రేపు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత సన్నిహితుడో వేరే చెప్పక్కర్లేదు.
అయితే ఎన్టీఆర్ తో సినిమాకి ఆయన్ని పిలుస్తారో లేదో, పిలిస్తే ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో? ..ఇలా చాలా సందేహాలు వున్నాయి. వాటి అన్నిటిని పటాపంచలు చేస్తూ ఈ సినిమా ఓపెనింగ్ కి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఈ విషయంలో త్రివిక్రమ్ మాటకి ఎన్టీఆర్ ఎంతో సంతోషంగా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇలాంటి చర్యలతో టాలీవుడ్ లో ఫాన్స్ మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు.