పెద్దపల్లి జిల్లాలో విషాదం

పెద్దపల్లి జిల్లాలో విషాదం

విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో పెద్దపల్లి జిల్లాలో విషాదం అలుముకుంది. ఈ కాల్పుల్లో ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన మావోయిస్టు కీలక నేత సందె గంగయ్య మృతి చెందారు.కాగా విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌ల‌మెట్ట‌ వ‌ద్ద‌ గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అందులో మావోయిస్టు పార్టీ డీసీఎంగా కొనసాగుతున్న అశోక్ అలియాస్ సందె గంగయ్య కూడా ఉన్నాడు. ఇతనికి తల్లి, నలుగురు సోదరులు ఉన్నారు. గంగయ్య సోదరుడు రాజయ్య సైతం 1996లో ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

ఇక 1999లో నక్సల్ ఉద్యమంలో చేరిన గంగయ్య మావోయిస్ట్ డీసీఎం కమాండర్‌గా ఎదిగాడు. ఓదెల మండలంలోనే 7వ తరగతి వరకు చదువుకున్నాడు. తన కొడుకు గంగయ్య ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడన్న సమాచారం తల్లి అమృతమ్మకు తెలియడంతో ఆమె బోరున విలపించారు. ఇది వరకు రెండు మూడు సార్లు ఎన్‌కౌంటర్‌ అయినట్లు సమాచారం వచ్చినప్పటికీ నమ్మలేదని, ప్రస్తుతం పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఎన్‌కౌంటర్‌లో అమరుడైనట్లు భావిస్తున్నామని సోదరుడు తెలిపారు. మృతదేహాన్ని తీసుకురావడానికి వైజాగ్ వెళ్తున్నట్లు పేర్కొన్నారు.