హైదరాబాద్‌లో ఆసరా పెన్షన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పాతబస్తీకి చెందిన నలుగురు వ్యక్తులు కొన్ని నెలలుగా 250 మంది వృద్ధుల పెన్షన్లను డైవర్ట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదుతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. కలెక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు… పాతబస్తీకి చెందిన ఇమ్రాన్, సొహెల్, అస్లాం, మోసిన్‌లను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అస్లాం సాయంతో నిందితులు ఈ స్కాంకు పాల్పడినట్టు తెలుస్తోంది. 2017లోనూ పెన్షన్ల స్కాంలో అస్లాం జైలుకు వెళ్లొచ్చినట్టు తెలుస్తోంది. అయినా అతడి తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం. వాళ్లు దొరికితే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్ని నెలల నుంచి ఈ స్కాం జరుగుతుంది ? ఇందులో ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ చేపట్టారు. పాతబస్తీలో అమాయక వృద్ధులను మోసం చేస్తూ ఈ ముఠా పెన్షన్లను కాజేస్తున్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.