ఆ పోలీస్‌స్టేషన్‌ అంటే భయపడుతున్నారు

ఆ పోలీస్‌స్టేషన్‌ అంటే భయపడుతున్నారు

అయ్యబాబోయ్‌ జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషనా..! ఇదీ కొత్తగా ఇక్కడకు రావాలంటే అధికారుల పరిస్థితి. ఈ ఠాణాకు వచ్చిన ఏ అధికారి కూడా పట్టుమని ఏడా ది కూడా పనిచేయట్లేదు. అసలు ఈ పోలీస్‌స్టేషన్‌కు ఏమైంది?. ఇది ప్రస్తుతం జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌పై చర్చ. ఇక్కడకు వచ్చిన అధికారి పూర్తి కాలం కూడా పనిచేయడం లేదు. మధ్యలో ఒకరిద్దరు పనిచేసినా మిగిలిన వారంతా వివిధ కారణాలతో బదిలీ అయ్యారు. దీంతో జంగారెడ్డిగూడెంలో పనిచేయాలంటేనే అధికారులు భయపడుతున్నారు.

ఈనేపథ్యంలో జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అసలు జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌కు ఏమైంది! పోలీస్‌స్టేషన్‌కు వాస్తు లోపం ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. పోలీస్‌స్టేషన్‌ నిర్మించిన నాటి నుంచి ఇదే పరిస్థితి ఉందని ప్రజలు, సిబ్బంది చర్చించుకుంటున్నా రు. 2007 నుంచి 13 ఏళ్లలో 14 బదిలీలు జరిగాయి. ఇందులో కొన్ని చాలా చిన్న కారణాలతో జరగడం గమనార్హం.

పోలీస్‌స్టేషన్‌కు వాస్తుదోషం ఉందని ఈ ప్రాంతవాసులు అనుమానిస్తున్నారు. వాస్తదోషమో లేక గ్రహస్థితో తెలియదుగానీ ఇక్కడకు వచ్చిన తక్కువ కాలంలో పలువురు సస్పెండ్‌ కావడం లేదా బదిలీ అవడం జరిగిపోతోంది. ఇక్కడ పనిచేసే అధికారులు అనతికాలంలోనే బదిలీపై వెళ్లడంతో, కొత్త గా ఈ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసేందుకు చాలా మంది వెనుకంజ వేస్తున్నట్టు తెలిసింది. కొంతమంది బదిలీపైనా వెళితే.. మరికొందరు సస్పెన్షన్‌ గురికావడం, ఇంకొందరు చిన్న కారణాలకే వీఆర్‌కు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది.