టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ పరిశ్రమపైనే కాకుండా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ బాలకృష్ణకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఇక్బాల్.. బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుపట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పడిపోతుందని బాలకృష్ణ ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి ఆయన తెలియదా అని ఎద్దేవా చేశారు. గేట్లు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని సీఎం జగన్ ఏనాడో చెప్పారని గుర్తుచేశారు. విలువలకు కట్టుబడి సీఎం జగన్ పాలన సాగుతుందని చెప్పారు.మానసిక స్థితికి సంబంధించి బాలకృష్ణ ఒకసారి చెక్ చేయించుకోవాలని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ చర్చలకు పిలవలేదన్న బాధ బాలకృష్ణలో కనిపిస్తోందన్నారు. టీడీపీ అధ్యక్షుడు నిర్వహిస్తోంది మహానాడా లేక జూమ్ నాడా అని ప్రశ్నించారు. హిందూపురం ప్రజలను బాలకృష్ణ పట్టించుకోవడం లేదని విమర్శించారు.