సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న దిశ ఎన్‌కౌంటర్ చిత్రంపై నిందితుల తరఫు న్యాయవాదులు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్‌ను కలిశారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేయకుండా చూడాలని కోరారు.
ఈ మేరకు కవాడిగూడ సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ బాలకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్‌లో దిశపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి ఆర్జీవీ దిశ ఎన్‌కౌంటర్ పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ఇదివరకే హైకోర్టును ఆశ్రయించారు. సినిమాను నిలిపివేసేలా కేంద్రం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా దిశ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించి సినిమాను నిలిపివేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
