చిరుతపులిని చంపి, దాని మాంసాన్ని తిన్న ఐదుగురు నిందితులను కేరళ ఫారెస్ట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పథకం ప్రకారం చిరుతను ఉచ్చులోకి లాగి దాన్ని చంపినట్టు నిందితులు వెల్లడించారు. బుధవారం ఇడుక్కి జిల్లాలోని మన్కులమ్లో ఈ ఘటన జరిగింది. నిందితులు పీకే వినోద్ (45),వీపీ కురియకొసే (74), సీఎస్ బిను (50), సాలీ కుంజప్పన్ (54), విన్సెంట్ (50)లను అదుపులోకి తీసుకున్నారు. వినోద్ సహా నిందితులు మునిపరా అటవీ ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో ఉండే ప్రయివేట్ భూమి వద్ద చిరుతను ట్రాప్ చేశారు.
‘బుధవారం ఉదయం ఆరేళ్ల వయసున్న చిరుతపులి వీరి ఉచ్చులో చిక్కుకుంది.. అనంతరం దానిని వినోద్ ఇంటికి తరలించి చంపేశారు.. దాని మాంసాన్ని వండుకుతిన్నారు.. దాని పళ్లు, చర్మాన్ని ఇంటిలో భద్రపరిచారు’ అని మన్కులమ్ డిప్యూటీ ఫారెస్ట్ అధికారి సుహైబ్ తెలిపారు. చిరుత హత్య గురించి సమాచారం అందుకున్న నాలుగు గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మన్కులమ్ రేంజ్ ఆఫీస్ వీబీ ఉదయ్ సూర్యన్ నేతృత్వంలోని అటవీ అధికారుల బృందం నిందితులను అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితుడి ఇంటిలో 10 కిలోల చిరుత మాంసం కూడా స్వాధీనం చేసుకున్నారు.
చిరుతను వేటాడటంలో వినోద్ కీలక పాత్ర పోషించాడని, మిగతా నిందితులు దాని మాంసం తినడంలో పాలుపంచుకున్నారని అధికారులు తెలిపారు. ‘చిరుతపులి ఇండియన్ వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) చట్టం, 1972 షెడ్యూల్ I జాబితాలో చేర్చారు. ఈ చట్టం ప్రకారం చిరుతను చంపడం నేరం. నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. కేరళలో మొట్టమొదటిసారి చిరుతపులిని చంపి, తిన్న ఘటన ఇదేనని ’ పేర్కొన్నారు.