నరమాంసాన్ని భక్షించారన్న ఆరోపణలతో కొంతమంది సమియాదీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుర్రెను చేతబట్టి నృత్యం చేస్తూ.. మనిషి మాంసం తిన్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై స్పందించి వారిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని తెన్‌కాశీలో గల కలురాణి గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాలు.. తమను తాము స్వామీజీలుగా చెప్పుకొనే సమియాదీలు.. కట్టు కోవిల్ ఆలయం వద్ద ఉత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా.. మనిషి పుర్రెను చేతులో పట్టుకుని, నరమాంసం తింటూ నృత్యాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న గ్రామస్థాయి అధికారి ఘటనాస్థంలోని పరిస్థితులను పరిశీలించారు. మనిషి మాంసం తింటున్న ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సమయాదీలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.ఇక విచారణలో భాగంగా వారిని ప్రశ్నించగా.. తాము మైకంలో ఉన్నామని, ఏం చేస్తున్నామో తమ ఆధీనంలో లేదని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ విషయం గురించి గ్రామస్తులు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ… ‘‘గతంలో కూడా ఉత్సవ సమయంలో పుర్రెను తీసుకువచ్చేవారు. అయితే ఈసారి మనుషుల శరీర భాగాలను కూడా తమతో తీసుకువచ్చినట్లు అనిపించింది’’ అని భయాందోళనకు గురయ్యారు. కాగా మృతదేహాన్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చారన్న విషయంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ఐపీసీ 297(అనుమతి లేకుండా శ్మశానాల్లో ప్రవేశించడం) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిట్లు పోలీసులు తెలిపారు.