అభిమానుల కోసం రాజాజీ హాల్ లోనే కరుణ పార్ధివ దేహం…!

People Rushing Rajaji Hall To Pay Last Respects To Karunanidhi

అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్ధివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాల్‌కు ఈరోజు ఉదయం తరలించారు. ఆయనను కడసారి చూసేందుకు ప్రముఖులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రాజాజీ హాల్‌లో కరుణానిధి పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కరుణానిధి భౌతకకాయాన్ని సందర్శించారు.

People Rushing Rajaji Hall To Pay Last Respects To Karunanidhi
పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కరుణానిధికి నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. నటుడు రజనీకాంత్ నిన్న రాత్రే గోపాలపురంలోని కరుణ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాక ఉదయం కూడా రజనీకాంత్‌ తన కుటుంబంతో సహా వచ్చి కరుణకి నివాళులర్పించారు. తమిళ నటులు సూర్య, ఆర్య తదితరులు కరుణానిధికి నివాళులు అర్పించారు.కరుణానిధిని కడసారి చూసేందుకు పలువురు రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు రాజాజీ హాల్‌కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. తమ అభిమాన నేతను చివరి సారి చూసేందుకు రాజాజీ హాల్‌కు వేలాదిగా ప్రజలు చేరుకుంటున్నారు. అంత్యక్రియలు చేపట్టాల్సిన స్థలం వివాదంపై మద్రాస్ హైకోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వాలని డీఎంకే చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో డీఎంకే హైకోర్టును ఆశ్రయించగా ప్రధాన న్యాయమూర్తి నివాసంలోనే అర్థరాత్రి విచారణ చేపట్టారు. అది కాసేపటిలో తేలనుంది.