బైక్ మీద వెళ్లేవారు క్షేమం కోసం శిరస్త్రాణం తప్పక ధరించాలి. కొంత మంది నాణ్యమైన ఐఎస్‌ఓ ధృవీకృత హెల్మెట్లను వాడితే మరికొందరు చీప్‌గా దొరికే వాటితో సర్దుకుపోవచ్చు. ఇక తలను పూర్తిగా కాకుండా సగం మాత్రమే కప్పి ఉంచే శిరస్త్రాణాలను వాడడం పెరిగిపోతోంది. ఈ హాఫ్ హెల్మెట్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ముప్పును ఆపలేవని నిమ్హాన్స్, పోలీసులు చేపట్టిన అధ్యయనంలో తేలింది. బెంగళూరులో నమోదైన రోడ్డు ప్రమాదాల గణాంకాలను గమనిస్తే మృతుల్లో ఎక్కువమంది హాఫ్ హెల్మెట్లను ధరించిన వారు ఉన్నారు.
ముఖం భాగాల్లో గట్టి దెబ్బలు తగిలే ప్రమాదాన్ని ఇవి ఏమాత్రం తగ్గించలేవని వెల్లడైంది.ఐటీ నగరంలో 15 చోట్ల 90 వేల ద్విచక్రవాహనదారులను పరిశీలించగా నాణ్యత లేని హాఫ్ హెల్మెట్లను ఎక్కువ మంది ధరిస్తున్నట్లు గుర్తించారు. 60 శాతం మంది చవక రకం హెల్మెట్లనే వాడుతున్నట్లు తేలింది. ప్రస్తుతం హెల్మెట్ల వినియోగంపై 15 రోజుల పాటు అవగాహన కల్పించాలని పోలీసు శాఖ యోచన చేస్తోంది. అనంతరం హాఫ్ హెల్మెట్లను ధరించేవారికి జరిమానాలు విధించాలని ఆలోచిస్తున్నట్లు భావిస్తోంది.