పెట్రోల్ బాదుడు

పెట్రోల్ బాదుడు

నవంబరు వరకు పెట్రోల్ బాదుడు తప్పేలా లేదు. చమురు ఉత్పత్తిపై ఒపెక్‌ దేశాలతో పాటు వాటి మిత్ర కూటమి తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ఫలితంగా గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. సోమవారమయితే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరాయి.

కోవిడ్‌ మహమ్మారి సమయంలో తగ్గిన ఉత్పత్తిని పునరుద్ధరించే క్రమంగా నెమ్మదిగా ఉండాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం నవంబర్‌లో రోజుకు 400,000 బారెళ్ల మేర మాత్రమే ఉత్పిత్తిని పెంచాలని ఒపెక్, ఈ కూటమి మిత్ర దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇప్పుడప్పుడే చమురు ఉత్పత్తి పెరిగే పరిస్థితి కనిపించడం లేదు.

మరోవైపు వినియోగదారుల నుంచి డిమాండ్‌ పెరిగింది. ఐనప్పటికీ గ్లోబల్‌ మార్కెట్లలోకి భారీ సరఫరాలను పెంచరాదని ఒపెక్‌ కూటమి నిర్ణయించింది. ఫలితంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్వీట్‌ క్రూడ్‌ బేరల్‌ ధర 3 శాతంపైగా లాభంతో 78 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతుండగా, బ్రెంట్‌ క్రూడ్‌  ధర దాదాపు 3 శాతం లాభంతో  82 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది.