పెట్రో మంట

పెట్రో మంట

పండుగ తర్వాత చల్లబడుతుందేమో అనుకున్న పెట్రో మంట.. మళ్లీ ఎగసిపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్‌ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. దీంతో గురవారం మళ్లీ ధరలు పెరిగాయి. ఇదే స్పీడ్‌ కొనసాగితే.. మరో రెండు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగాయి. దీనితో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.54పై. గా, డీజిల్‌ ధర రూ.95.27కు ఎగబాకింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.112.44కి, డీజిల్‌ ధర రూ.103.26గా చేరింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రో మంటలు ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రేటు రూ.117.98గా ఉందక్కడ.

ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.103.71 డీజిల్ 99.59కి చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.25కి చేరగా, డీజిల్ ధర 101.12ను తాకింది. కోల‌్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.107.11, డీజిల్ రూ.98.38గా ఉంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్‌ ధర రూ. 110.92, డీజిల్‌ ధర రూ. 103.91కు చేరింది.పెట్రోల్‌ ఎంత ప్రియంగా మారిందంటే.. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ కంటే 35 శాతం ధర ఎక్కువ!. ఏటీఎఫ్‌ కిలో లీటర్‌కు ఢిల్లీలో 79వేలకు అమ్ముడుపోతోంది. అంటే లీటర్‌కు కేవలం 79 రూ. అన్నమాట.

పెట్రో మంట తగ్గాలంటే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతోంది కేంద్రం. ఇందుకోసం సౌదీ అరేబియా నుంచి రష్యా వరకు.. చమురు ఉత్పత్తి దేశాలతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు నిర్వహిస్తోంది. మరోవైపు పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది.