పిల్లలకు ఫైజర్ టీకా

పిల్లలకు ఫైజర్ టీకా

ఐదు నుంచి పదకొండేళ్ల మధ్య పిల్లలకు ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్ టీకా వినియోగానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. అమెరికాలో 11 ఏళ్లలోపు చిన్నారులకు ఆమోదం లభించిన తొలి వ్యాక్సిన్ ఇదే. అయితే, టీకాకు ఆమోదం తెలిపినా.. ఇప్పటికిప్పుడే వ్యాక్సినేషన్ ప్రారంభించరు. దీనిపై వచ్చే మంగళవారం అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిపుణుల బృందంతో చర్చించనుంది. టీకాను పిల్లలకు ఏవిధంగా ఇవ్వాలనే అంశంపై సలహా తీసుకోనుంది.

మరోవైపు, శనివారం నుంచి పిల్లలకు టీకాలను ఫార్మసీలు, పీడియాట్రీషియన్ ఆఫీసులు, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్టు ఫైజర్ వెల్లడించింది. ఎఫ్‌డీఏ నిర్ణయంతో అమెరికాలోని 28 మిలియన్ల మంది పిల్లలకు టీకా అందుబాటులోకి రానుంది. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్ టీకాను అందజేయాలని ఎఫ్‌డీఏ సలహాదారుల బృందం మంగళవారం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల ఆధారంగా ఎఫ్‌డీఏ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతుండగా.. చైనా, క్యూబీ, యూఏఈ వంటి దేశాల్లో చిన్న పిల్లలకు టీకా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ అమెరికాలో కొనసాగుతోంది. తాజాగా 5-11 ఏళ్లలోపు చిన్నారులకు ఆమోదం లభించగా.. వీరికి 10 మిల్లీగ్రాముల డోస్ ఇవ్వనున్నారు. సాధారంగా 12 ఏళ్లు, ఆపై వయస్కులకు ఒక్కో డోస్‌లో 30 మిల్లీగ్రాములు ఔషధం ఉంటుంది.

తక్కువ మోతాడు వల్ల దుష్ప్రభావాలు చాలా స్వల్పంగా ఉంటాయని ఎఫ్‌డీఏ‌లోని నిపుణుల బృందం పేర్కొంది. ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకునే యుక్త వయస్కుల్లో గుండె కండరాల వాపు లేదా మయోకార్డిటిస్ వంటి దుష్ప్రభావాలు తలెత్తినట్టు అధ్యయనంలో గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్నారులకు తక్కువ మోతాదు ఇవ్వాలని సూచించారు.