వందే భారత్ ఆపరేషన్ కింద కేంద్రప్రభుత్వం విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం ఏకంగా ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా రష్యాలోని మాస్కో నుంచి భారతీయులను వెనక్కు తీసుకొచ్చేందుకు ఎయిరిండియా విమానం శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ విమానం బయలుదేరి కొంత దూరం వెళ్లిన తర్వాత.. అందులోని పైలట్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. అయితే వెంటనే హుటాహుటిన దానిని వెనక్కు రప్పించారు. అయితే సిబ్బంది ప్రీ-ఫ్లైట్ టెస్ట్ రిపోర్టులను తనిఖీ చేస్తున్న బృందం.. పైలట్‌కు పాజిటివ్ రాగా.. పొరపాటున అతడికి నెగెటివ్‌గా వచ్చినట్టు తెలిపింది. దీంతో ఆ పైలట్‌ను విమానంలోకి అనుమతించారు.
అదేవిధంగా విమానం బయలుదేరిన తర్వాత పొరపాటును గుర్తించడంతో వెంటనే దాన్ని వెనక్కు రప్పించడం వంటివి జరిగాయి. ఎయిర్‌బస్ ఏ320 నియో (వీటీ-ఈఎక్స్‌ఆర్) మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. అయితే పైలట్‌ను నిబంధనల ప్రకారం క్వారంటైన్‌కు తరలించారు. విమానాన్ని రసాయనాలతో శుభ్రపరిచారు. ఆ తర్వాత మరో విమానాన్ని మాస్కోకు పంపారు. కాగా పెద్ద సంఖ్యలో విమాన సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తుండటంతో నివేదికల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఢిల్లీలోని విమానాశ్రయంలో రోజూ 300 మందికిపైగా విమాన సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ ల్యాబ్‌లకు పంపుతారు. ఈ ఫలితాలను ఎక్సెల్ షీట్ ద్వారా పంపుతున్నారు. దీంతో నెగెటివ్‌గా వచ్చినట్టు పొరబడి ఢిల్లీ-మాస్కో విమానం ఏ320 సిబ్బందిని క్లియర్ చేశారు’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.