ఎయిరిండియాకు చెందిన ఓ విమానం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద ఇరుక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ విమానాశ్రయం బయట ఢిల్లీ-గురుగ్రాం జాతీయ రహదారిపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఎయిరిండియా విమానం ఇరుక్కుపోయింది. ఎయిరిండియాకు చెందిన ఓ పాత విమానం స్క్రాప్ కింద విక్రయించారు. దాన్ని కొనుగోలు చేసిన యజమాని భారీ ట్రాలీలో తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిందని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు వివరణ ఇచ్చారు.
ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎయిరిండియా విమానం పాదచారుల వంతెన కింద ఇరుక్కుపోయిన ఘటనతో తమకు సంబంధం లేదని, ఆ పాత విమానాన్ని తుక్కు కింద విక్రయించామని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు. ‘ఇది పాత విమానం.. స్క్రాప్ కింద దానిని అమ్మేశాం.. దీనిని కొనుగోలు చేసిన వ్యక్తి తీసుకెళ్లడంతో తమకు ఎటువంటి సంబంధం లేదు.. దీని గురించి అదనపు సమాచారం లేదు’ అని తెలిపారు.
అంతేకాదు, ‘విమానం ఖచ్చితంగా ఢిల్లీ విమానాశ్రయానికి చెందింది కాదు… ఎటువంటి రెక్కలు లేకుండా రవాణా చేస్తున్నారు.. ఇది తుక్కు కింద చేసిన విమానం.. దానిని వాహనం ద్వారా తరలిస్తున్నప్పుడు డ్రైవర్ తప్పిదం వల్లే ఇలా జరిగుంటుంది’ అని తెలిపారు.