ప్ర‌ధాని త‌న హామీలు లోక్ స‌భ‌లో ప్ర‌క‌టించాలిః బాబు డిమాండ్

PM announce his assurances in Lok Sabha chandraBabu demands,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అన్ని స‌మ‌స్య‌లూ ప‌రిష్క‌రిస్తామ‌ని, ఆందోళ‌న విర‌మించాల‌ని ప్ర‌ధాని మోడీ టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రిని కోరారు. చంద్ర‌బాబు సూచ‌న మేర‌కు సుజ‌నా చౌద‌రి ప్ర‌ధానితో 32 నిమిషాల పాటు స‌మావేశ‌మ‌య్యారు. విభ‌జ‌న స‌మస్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో కొన‌సాగుతున్న ఆల‌స్యం, ఏపీ ప‌ట్ల కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతున్న ఆగ్ర‌హావేశాల‌ను సుజ‌నా ప్ర‌ధానికి వివ‌రించారు. ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా మిత్ర‌ప‌క్షంగా టీడీపీ కేంద్రానికి స‌హ‌క‌రిస్తోంద‌ని, అన్ని విష‌యాల్లోనూ వెన్నంటి ఉంద‌ని సుజ‌నా ప్ర‌ధానితో అన్నారు. కేంద్రం తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంద‌ని, ఏపీ ప‌ట్ల కేంద్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

ప్ర‌త్యేక హోదా స్థానంలో ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించి ఏడాది పూర్త‌యినా…అమ‌లుకు నోచుకోలేద‌ని, మ‌రోవైపు చాలా రాష్ట్రాల‌కు జీఎస్టీ త‌ర్వాత కూడా హోదా కొన‌సాగిస్తున్నార‌ని ఆరోపించారు. కేంద్రానికి అన్ని విష‌యాల్లో స‌హ‌క‌రిస్తున్నా..ఏపీ విష‌యంలో మాత్రం వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని, రాజ‌ధాని శంకుస్థాప‌న స‌మ‌యంలో ఇచ్చిన వాగ్ధానాల‌న్నీ ప‌క్క‌కు పోయాయ‌ని సుజ‌నా ఆక్షేపించారు. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మిమ్మ‌ల్ని క‌లిసి అనేక విష‌యాలు ప్ర‌స్తావించార‌ని, వాటిలో ఒక్క విష‌యంలోనూ పురోగ‌తి లేద‌ని సుజనా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు స్పష్టీక‌రించారు.

సుజనా వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ప్ర‌ధాని అన్ని విష‌యాలూ ప‌రిష్క‌రిస్తామ‌ని, ఆందోళ‌న విర‌మించాల‌ని కోరగా…ఆ అంశం త‌న చేతుల్లో లేద‌ని సుజ‌నా చెప్పారు. దీనిపై సీఎం చంద్ర‌బాబుతో తానే స్వ‌యంగా మాట్లాడ‌తాన‌ని మోడీ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై టీడీపీ ఆందోళ‌న బాట ప‌ట్ట‌డంతో ఈ ఉద‌యం ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఫోన్ వ‌చ్చింది. టీడీపీ పార్ల‌మెంట‌రీ నేత‌ను ప్ర‌ధాని క‌ల‌వాల‌నుకుంటున్నార‌ని అవ‌త‌లి నుంచి చెప్పారు. దీంతో ప్ర‌ధానిని కల‌వాల్సిందిగా చంద్ర‌బాబు సుజ‌నా చౌద‌రిని కోరారు. అటు ప్ర‌ధాని సుజ‌నాకు ఇచ్చిన హామీపై చంద్ర‌బాబు అప‌న‌మ్మ‌కం వ్య‌క్తంచేశారు. త‌న హామీల‌ను ప్ర‌ధాని లోక్ స‌భ‌లో ప్ర‌క‌టిస్తేనే ఆందోళ‌న విర‌మించాల‌ని ఎంపీలకు సూచించారు.